Rythu Bharosa | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కోసం విడుదల చేసిన నిధులను కాంట్రాక్టర్ల బకాయిలు తీర్చేందుకు వినియోగిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు రైతుభరోసా కింద మూడు విడతలుగా రూ.3,511 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, అందులో సగం సొమ్మును రైతులను కాదని బడా కాంట్రాక్టర్లకు ముట్టజెప్పినట్టు సమాచారం. గరిష్ఠంగా 20% కమీషన్ చొప్పున తీసుకొని పెండింగ్ కాంట్రాక్టు బిల్లులు చెల్లించినట్టు తెలిసింది. మూడెకరాల వరకు రైతుభరోసా ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్తుండగా, వారిలో 55% మంది రైతులకు మాత్రమే భరోసా నిధులు జమైనట్టు, మరో 45% మంది రైతుల డబ్బు దారిమళ్లినట్టు లీడ్‌బ్యాంకు నివేదికలు చెప్తున్నాయి.
అప్పు తెచ్చిన సొమ్ము అప్పనంగా..
యాసంగి సీజన్లో ఎకరానికి రూ.6వేల చొప్పున 1.49 కోట్ల ఎకరాలకు రైతుభరోసా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీజన్లో రైతుభరోసాకు రూ.9000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఖజానాలో సొమ్ములు లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ 25 లో ఉన్న 400 ఎకరాల టీజీఐఐసీ భూములను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బ్యాంకులకు కుదువపెట్టి రూ.10వేల కోట్లు సమీకరించింది. ఈ నిధులతో ఒకేసారి రైతుల అందరి ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉండే కానీ ఏం జరిగిందో ఏమో..! ఒకేసారి కాకుండా విడతలవారీగా రైతు భరోసా నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ అర్ధరాత్రి నుంచే భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో టకీటకీమని పడుతాయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన జనవరి 26 నుంచి ఇప్పటివరకు మూడు విడతలు రూ.3,511 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన డబ్బును కాంట్రాక్టు బిల్లుల చెల్లింపునకు వినియోగించినట్టు తెలిసింది. అంతేకాకుండా, రైతులకు విడుదల చేసిన నిధుల్లో కూడా కొంతభాగం మళ్లీ కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులకే వినియోగించినట్టు సమాచారం.
45% మంది రైతుల సొమ్ము మళ్లింపు
మొదట ప్రయోగాత్మకంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని 577 గ్రామాల్లోని 4.42 లక్షల మంది రైతులకు రూ.593 కోట్లు జమ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత కింద ఎకరం వరకు భూమి ఉన్న 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.557.54 కోట్లు జమ చేసింది. రెండో విడతలో రెండెకరాల వరకు భూమి ఉన్న 13.23 లక్షల మందికి రూ.1,091.95 కోట్లు చెల్లించింది. మూడో విడతలో మూడెకరాలలోపు భూమి ఉన్న 10.13 లక్షల మంది రైతులకు రూ.1,269.32 కోట్లువిడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని విడతలు కలిపి ఇప్పటివరకు మొత్తంగా రూ.3,511.82 కోట్లు విడుదలచేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు 45% మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం విదిల్చిన సొమ్ములో రూ.1,800 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ అయినట్టు తెలుస్తున్నది. మిగిలిన డబ్బును ప్రభుత్వ పెద్దలే వ్యూహాత్మకంగా కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి మళ్లించినట్టు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. దాదాపు 1,700 కోట్ల రైతుభరోసా డబ్బును 15% నుంచి 20% కమీషన్లతో కాంట్రాక్టర్లకు చెల్లించినట్టు అర్థిక శాఖ గుర్తించినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
రైతు భరోసాతోనే కాంగ్రెస్ తొలి దందా!
అసెంబ్లీ ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లో రైతుబంధు కింద పెట్టుబడిసాయం జమ చేయడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7వేల కోట్లకుపైగా నిధులను సమాకూర్చి పెట్టింది. రైతుబంధు ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉన్నదంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈసీ ఆంక్షలు విధించింది. దీంతో ఆ డబ్బు రైతుల ఖాతాల్లో జత కాకుండా ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి చూపు ఈ నిధులపైనే పడ్డంది.
ఈ మొత్తం రూ.7 వేల కోట్ల డబ్బును కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేతకు సంబంధించిన ఒక కాంట్రాక్టు సంస్థకు చెందిన ఏజెన్సీలకు గుండుగుత్తగా బిల్లులు చెల్లించినట్టు అప్పట్లో మీడియా వర్గాల్లో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఒకో సీజన్‌కు ఎకరానికి రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ 2024 వానకాలం సీజన్లో రైతుభరోసా ఇవ్వలేదు. యాసంగి సీజన్లో ఒకో ఎకరానికి రూ.7,500కు బదులుగా రూ.6 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా తన సొంత నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతుభరోసా పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
సాగు భూములకూ రైతు భరోసా ఎగవేత
సాగుయోగ్యం కాని భూములకు రైతుభరోసా ఇవ్వబోమని చెప్పిన ప్రభుత్వం అలాంటి భూముల గుర్తింపునకు సర్వే చేసింది. ఈ సర్వే మొత్తం ప్రహసనంగా మారడంతో సాగుయోగ్యం కాని భూములతోపాటు పంటలు సాగు చేసిన భూములు సైతం బ్లాక్‌లిస్టులోకి ఎక్కాయి. ఒక సర్వే నంబర్లో పదెకరాల భూమి ఉంటే, అందులో సగం భూమి నేషనల్ హైవే కోసమో, ఇరిగేషన్ ప్రాజెక్టుల కాల్వలు, ఇతర అవసరాల కోసమో సేకరించిన చోట ఆ సర్వే నంబర్ మొత్తాన్నిబ్లాక్లిస్టులో పెట్టినట్టు సమాచారం. ఒక సర్వే నంబర్లో కొంత భూమిని ఇండ్ల స్థలాలుగా మారిస్తే.. ఆ సర్వే నంబర్‌ను మొత్తాన్ని బ్లాక్‌లిస్టు కింద చేర్చినట్టు తెలిసింది. దీంతో ఆయా భూములకు రైతుభరోసా దక్కకుండా పోతున్నది. ఇలా 22 వివాదాస్పద అంశాల కింద రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల వరకు బ్లాక్‌లిస్టులో పెట్టినట్టు వ్యవసాయ శాఖ నివేదికలు చెప్తున్నాయి. ఈ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు వినియోగించినట్టు తెలిసింది.