హైదరాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ) : విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే సైన్స్ ఫెయిర్లు, ఎగ్జిబిషన్లు అవినీతికి అడ్డాగా మారాయని, అక్రమార్కుల పంట పండిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైన్స్ ఫెయిర్ నిర్వహించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ జిల్లాల్లోని ప్రైవేట్ స్కూళ్ల నుంచి విద్యాశాఖ అధికారులు లక్షల్లో వసూలు చేసినట్టు విమర్శలొస్తున్నాయి. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు వాటాలేసుకుంటున్నారన్న గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎస్సీఈఆర్టీ, డీఈవోలు, సైన్స్ అధికారుల వరకు తలాపాపం తిలా పిడికెడు అన్న చందంగా తయారైందన్న ప్రచారం జరుగుతున్నది. గతంలో పంపకాల్లో తేడాలొచ్చి గొడవలు, రచ్చకు దారితీసిన ఉదంతాలున్నాయని సాక్షాత్తు టీచర్లే అంటున్నారు. మొత్తంగా సైన్స్ ఎగ్జిబిషన్ల పేరిట కొందరు జేబులు నింపుకుంటున్నారని బహిరంగంగానే చెబుతున్నారు.
జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లు ముగిశాయి. రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్ బుధవారం కామారెడ్డిలో ప్రారంభమైంది. వాస్తవానికి ఒక జిల్లా సైన్స్ ఫెయిర్‌ను ఎంత ఘనంగా నిర్వహించి నా గరిష్ఠంగా రూ.3.5లక్షలు సరిపోతాయని కానీ చాలాచోట్ల టార్గెట్లు పెట్టి అంతకుమించి వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో స్పాన్సర్షిప్ పేరిట వసూళ్లు చేశారట. కొన్ని జిల్లాల్లో ఎగ్జిబిషన్‌కు హాజరైన వారి టిఫిన్, భోజనాల ఖర్చులు ప్రైవేట్ స్కూ ళ్ల ఖాతాలో వేశారట. ఇంకా కొన్ని జిల్లాల్లో అ యితే డీసీఈబీ నిధులు వినియోగించారట. గతంలో సైన్స్ ఫెయిర్లకు కొందరు ఎమ్మెల్యేలే సొంతంగా నిధులు సమకూర్చేవారు. కొందరైతే ప్రైవేట్ స్కూళ్ల నుంచి వసూళ్లు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించిన దాఖలాలున్నాయి. తన నియోజకవర్గంలో వసూళ్లుచేస్తే ఊరుకోబోమని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి(ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకా లం) అధికారులను హెచ్చరించారు. ఆయనే సొంతంగా నిధులు సమకూర్చారు కూడా. కానీ ఇప్పుడు ఇదే అదునుగా కొందరు వసూళ్లు చేసి. జేబులు నింపుకొన్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.