హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా పీఎంఏవై పథకాన్ని ఇందిరమ్మ ఇండ్ల పథకంగా పేరు మార్చడంతో పేదల ఇండ్ల నిర్మాణానికి నిధుల సమస్య ఏర్పడే పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకానికి అనుబంధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో గృహనిర్మాణ పథకాన్ని అమలుచేస్తున్న విషయం విదితమే. రాష్ట్రంలో 20లక్షల మంది పేదలకు ఈ పథకం కింద ఇండ్లు నిర్మిస్తామని, కేంద్రం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ ఇండ్లు మంజూరు చేయిస్తామని ఇదివరకే సీఎం సహా మంత్రులు పలుమార్లు ప్రకటించారు.
పీఎంఏవై కింద కేంద్రం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విడివిడిగా ఒక్కో యూనిట్‌కు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. రాష్ట్ర ప్రభు త్వం తాము అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్టు వెల్లడించింది. కేంద్రం ఇచ్చే నిధులతో తమ వాటా నిధులు కలిపి ఇస్తామని తెలిపింది. అయితే పథకం పేరును ఇందిరమ్మ ఇండ్లుగా మార్చడమే సమస్యగా మారినట్టు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలుచేసే పథకాల పేర్లను మార్చేందుకు రాష్ర్టాలకు అధికారం లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం ఏ పథకం కింద నిధులు మంజూరు చేస్తుందో.. ఆ పథకాన్ని క్షేత్రస్థాయిలో యథాతథంగా అమలుచేయాల్సిన బాధ్యత రాష్ర్టాలపై ఉంటుంది.
ఇందిరమ్మ పేరుంటే నిధులు రానట్టే!
తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలు పీఎంఏవై పథకాన్ని యథాతథంగా అమలుచేస్తుంటే, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ర్టాలు పీఎంఏవైని అమలుచేస్తూనే విడిగా గృహనిర్మాణ పథకాలను చేపట్టాయి. ఈ రాష్ర్టాల్లో ఒక్కో ఇంటికి పీఎంఏవై పథకం మాదిరిగానే నిధులు ఇస్తున్నందున మార్పు కనిపించడంలేదు. మన రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా పీఎంఏవై నిధులకే రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా జోడించి ఇస్తూ, ఇందిరమ్మ ఇండ్ల పథకంగా పేరు మార్చడంతో కేంద్రం ఎలా స్పందిస్తుందో అన్న సందేహాలు నెలకొన్నాయి. పీఎంఏవై పథకాన్ని యథాతథంగా అమలు చేయకుంటే కేంద్రం నుంచి నిధుల విడుదలలో ఇబ్బందులు తప్పవని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చేది లేదని ఇదివరకే కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘సొమ్మొకరిది.. సోకొకరిది’ అనే చందంగా కేంద్ర నిధులతో రాష్ట్రం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేయాలంటే తాము ఒప్పుకోబోమని ఆయన తేల్చిచెప్పారు. దీంతో కేంద్ర నిధులపై నెలకొ న్న సందేహాలకు బలం చేకూరుతున్నది.