Telangana | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులకు నిధుల సమస్య వెంటాడుతున్నది. సుమారు 9,400 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించాల్సి ఉండగా, ఇందులో సగానికి పైగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. అన్ని రోడ్ల పునరుద్ధరణకు రూ.2,000 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు రూపొందించిన రోడ్లు భవనాల శాఖ, నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రావడంలేదు. రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ ఆధీనంలోని రోడ్లు మినహా, ఆర్అండ్బీ శాఖ పరిధిలో 24,245 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి.
రోడ్ల నిర్వహణలో భాగంగా ఏటా వర్షాకాలానికి ముందు మరమ్మతులు చేయడం, ప్రతి ఐదేండ్లకోసారి రోడ్లను పూర్తిగా పునరుద్ధరించడం ఆనవాయితీ. ప్రస్తుతం 9,400 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించాల్సి ఉన్నది. ఇందు లో సుమారు 4,000 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు పూర్తిగా ప్రయాణానికి వీలు లేకుండా ఉన్నట్టు గుర్తించారు. రోడ్ల వివరాలు, వాటి పునరుద్ధరణకు రూ.2,000 కోట్లు అవసరమవుతాయనే అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకు లేదు. నిధులు మంజూరు చేస్తేనే రోడ్లు మెరుగుపడే అవకాశం ఉన్నది.