హైదరాబాద్/సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ): ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి కాట విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం ఏర్పడగానే ఆమెకు విశేష ప్రాధాన్యత ఇస్తూ కట్టబెట్టిన పదవులన్నింటికీ ఇప్పుడు కత్తెర పెట్టింది. ఆమ్రపాలికి ఉన్న అదనపు పోస్టులను తొలగిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆమె గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్‌గానే పూర్తిస్థాయి బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇప్పటివరకు ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్ బాధ్యతలతో పాటు హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ బోర్డు ఎండీ, హెచ్‌జీసీఎల్ ఎండీ వంటి కీలక బాధ్యతలను ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. ఒకే ఐఏఎస్‌కు, అందునా అనేకమంది సీనియర్ ఐఏఎస్‌లను కాదని జూనియర్‌కు ఇన్ని కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. పైగా ఆమె ఏ బాధ్యతకూ సంపూర్ణ న్యాయం చేయలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కోటి మందికి పైగా జనాభా నివసించే జీహెచ్ఎంసీకి ఆమె సమయం కేటాయించలేకపోతున్నారని, ఫలితంగా సమస్యలు పేరుకుపోతున్నాయనే విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించడానికి ప్రభుత్వానికి ఎంతో సమయం పట్టలేదు. చివరకు ఆమెకు అదనపు బాధ్యతలను తొలగిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ విధులకు మాత్రమే పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఆమ్రపాలి సహా ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిశోర్‌కు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌కు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీసీఎల్) ఎండీగా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా ఉన్న కోట శ్రీవాస్తవను హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా, వెయింటింగ్‌లో ఉన్న చహత్ బాజ్‌పాయ్‌ను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. నారాయణపేట అదనపు కలెక్టర్(లోకల్‌బాడీ)మయాంక్ మిట్టల్‌ను జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.