కరీంనగర్, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జగిత్యాల(నమస్తే తెలంగాణ) : కేసీఆర్‌కు జగిత్యాల జైకొట్టింది. తాడిత, పీడిత వర్గాల హక్కుల కోసం నినదించిన జగిత్యాల గడ్డపై మరోసారి జనం ప్రజా సమస్యలపై రణనినాదం చేసింది. విప్లవాల పోరుగడ్డ వేదికగా తెలంగాణ రాష్ట్ర పునరేకీకరణ ఆవశ్యకతను చాటి చెప్పాలంటూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు జగిత్యాల ప్రజానీకం జయజయ ధ్వానాల నడుమ తమ ఉక్కు పిడికిళ్ల్లను ఎత్తి సంఘీభావాన్ని ప్రకటించింది. దా దాపు 50 ఏండ్ల క్రితం తాడిత, పీడిత, కార్మిక, కర్షక లోకం కోసం జైత్రయాత్రకు బీజం వేశా రో అదే మైదానం వేదికగా భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లను పూర్తిచేసింది. సో మవారం మధ్యాహ్నం నుంచే జగిత్యాల సభాస్థలికి జనం తండోపతండాలుగా తరలిరావడం కనిపించింది. ఎటుచూసినా జనం వం దల సంఖ్యలో కదలిరావడంతో జగిత్యాల పట్టణంలోని రోడ్లన్నీ కిటకిటలాడాయి.
సాయం ఆరు గంటల స మయంలో సభాస్థలి పూర్తిగా నిండిపోవడంతో మినీస్టేడియానికి నలువైపు లా ఉన్న రోడ్లు కిలోమీటర్ల పొడువునా జనం తో నిండిపోయాయి. చాలారోజుల తర్వాత కేసీఆర్ భారీ బహిరంగ సభకు హాజరవుతుండడం, సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి పార్టీలో చేరడంతో జనం సభాస్థలి సామర్థ్యం కంటే రెండు మూడు రెట్లు అధికంగా ప్రజలు వస్తారని నిర్వాహకులు భావించారు. మినీస్టేడియానికి అర కిలోమీటర్ దూ రం వరకు ప్రతి 200 మీటర్లకు ఒక భారీ ఎల్ఇడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ధర్మపురి, గొల్లపల్లి రోడ్డులో తాతమ్మ వరకు, కరీంనగర్ రోడ్డులో శ్రీనివాస థియేటర్ వరకు ఎల్ఇడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కరీంనగర్, నిజామాబాద్ వైపు నుంచి వచ్చిన ప్రజలకు పార్కింగ్ స్థలం సభాస్థలికి కిలోమీటర్‌కు పైగా దూరం ఉండడంతో వారు పూర్తిస్థాయిలో సభాస్థలికి చేరుకోలేక, గొల్లపల్లి రోడ్డులో అమర్చిన ఎల్ఈడీ స్క్రీన్లపై కేసీఆర్, జీవన్‌రెడ్డి, తదితరుల ప్రసంగాలను వీక్షించడం విశేషం.
కిక్కిరిసిన రోడ్లు..
నిర్దేశిత సమయానికి గంట ముందే సభాస్థలి పూర్తిగా నిండిపోవడంతో ఆలస్యంగా చేరుకున్న ప్రజలు సభాస్థలంలోకి వెళ్లలేకపోయా రు. సభాస్థలికి ప్రజలు వెళ్లలేకపోవడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఏ వీధిని చూసినా జనంతో ఉసిళ్ల పుట్టలా కనిపించాయి. గొల్లపల్లి రోడ్డులో, ధర్మపురి రోడ్డులో అన్నపూర్ణ చౌర స్తా, మిషన్ కాంపౌండ్, కరీంనగర్ రూట్లో ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడీల ముందు వేలాది మంది జనం సభ జరుగుతున్నంత సేపు వీక్షించారు. కేసీఆర్, జీవన్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రోడ్లపై ఎల్ఈడీలో వీక్షిస్తున్నవారు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. నృత్యాలు చేస్తూ తమ సంఘీభావాన్ని తెలుపడం గమనార్హం.
అడుగడుగునా ఆంక్షలు..
జగిత్యాల సభను అడ్డుకునేందుకు అధికార పార్టీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా జనం పట్టించుకోలేదు. నిజామాబాద్, కరీంనగర్ వైపు నుంచి వచ్చిన వాహనాలకు జగిత్యాల పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో మోతె రోడ్డులో పార్కింగ్ ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలం నుంచి సభా స్థలికి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సభలోకి వచ్చే జనాలను సైతం పోలీసులు ఇబ్బందులకు గురి చేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. పోలీసులు, అధికారులు ఎంతగా ఇబ్బందులు కల్పించినా ప్రజలు మాత్రం వాటన్నింటినీ ఛేదించుకుంటూ సభాస్థలికి వెల్లువలా తరలిరావడంతో అటు అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు సైతం అవాక్కయ్యారు.
సభ గ్రాండ్ సక్సెస్
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అధ్యక్షతన జరిగిన జగిత్యాల జనగర్జన సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అనుచరులు, శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తున్నది. వారం రోజులుగా బీఆర్ఎస్ శ్రేణులు, జీవన్‌రెడ్డి అనుచరులు జగిత్యాల సభను విజయవంతం చేయడానికి అంకుఠిత దీక్షతో శ్రమించారు. జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతోపాటు, ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవకర్గాల నుంచి, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ నియోజకవర్గాలు, లక్షెట్టిపేట, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల నుంచి ఊహించిన దాని కంటే ఎక్కువ సభకు రావడంంతో జగిత్యాలలో జనసునామీ కనిపించింది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. అనే అభిప్రాయం సర్వత్రా వెల్లువెత్తుతుందన్న విషయం స్పష్టమైందన్న అభిప్రాయం బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది.