Natu Kodi | ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 11 : నాటుకోడి సహజసిద్ధంగా పెరగడం.. పుష్కలమైన పోషకాలు ఉండటంతో వీటి మాంసానికి డిమాండ్ ఎక్కువ. ముఖ్యంగా ముఖ్యంగా సంక్రాతి పండుగ సందర్భంగా నాటుకోళ్లకు పుల్ గిరాకీ ఉంటుంది. పల్లె, పట్టణం తేడా లేకుండా మాంసం ప్రియులు మటన్‌కు బదులుగా నాటుకోడి కూరను ఆరగించేందుకు ఆసక్తి చూపడం కనిపిస్తున్నది. పల్లెలోని నిరుద్యోగ యువకులు నాటుకోళ్ల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. బాయిలర్ కోళ్ల పెంపకంతో పోల్చితే రిస్క్ తక్కువ, మందులు సైతం అంతగా వాడాల్సిన అవసరంలేదు. సహజసిద్ధంగా ఇండ్ల మధ్య, పెరట్లలో పెంచుకోవచ్చు. ఇటీవలి కాలంలో చాలా మంది షెడ్లలోనూ నాటుకోళ్లను పెంచుతున్నారు. మామూలు రోజుల్లో ఒక్కో కోడిపెట్ట రూ.300, కోడిపుంజు రూ.400ల వరకు పలుకుతుంది. కాని, సంక్రాతి పండుగ సందర్భంగా పండుగ సందర్భంగా ఒక్కో కోడిపెట్ట రూ.500, పుంజు 700ల వరకు విక్రయిస్తున్నారు.
బాయిలర్ కోళ్లతో పోల్చితే నాటుకోడి మాంసం ఆరోగ్యానికి మంచిదని ప్రజల నమ్మకం. ఎందుకంటే ఈ కోళ్లు సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం, మాంసం రుచిగా ఉండటంతో తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. మేక, గొర్రెల మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉండటంతో నాటుకోడి మాంసాన్ని ఆరగిస్తున్నారు. నాటుకోడి మాంసం కోసం ప్రజలు బారులు తీరుతుంటారు. నాటుకోళ్లను కొనేందుకు ఎన్ని డబ్బులు చెల్లించడానికైనా వెనుకాడటంలేదు.
ఒకప్పుడు గ్రామీణులు ఇంటింటా కోళ్లను పెంచుకునేవాళ్లు. చుట్టాలు వచ్చినా, పండుగలు వచ్చినా కోడి కూర వండేవారు. మారిన జీవనశైలితో పాటు కోళ్లతో పెంపకం, వాసన తదితర ఇబ్బందులను గమనించిన పల్లె ప్రజలు వీటి పెంపకాన్ని తగ్గించారు. ఈ క్రమంలో బాయిలర్ కోళ్లు రావడం, ప్రతి ఊరిలో చికెన్ సెంటర్లు వెలియడంతో ప్రజలు ఈ చికెన్ వైపే మొగ్గు చూపారు. బాయిలర్ చికెన్ వండటం సులభం కావడం, ఎప్పుడంటే అప్పుడు దొరికే అవకాశం ఉండటంతో ప్రజలు నాటుకోడిని మరిచిపోయారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు నాటుకోడి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రొటీన్లతో కూడిన ఆహారంతో ఇమ్యూనిటీ పెంచుకోవాలని వైద్యులు సూచిస్తుండటంతో నాటుకోడి మాంసానికి గిరాకీ పెరిగింది.