Harish Rao : ఎన్నికల సందర్భంగా ఓట్లు దండుకోవడం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు (BRS Leader), మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సర్కారుపై నిప్పులు చెరిగారు. ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాడు తన ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్నదని ఆయన గుర్తుచేశారు.
అయితే కాంగ్రెస్ తన మానిఫెస్టోలో పేర్కొన్న మేరకు ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం ఎప్పటి నుంచి ఇస్తుందని ప్రశ్నించారు. గత వారం రోజులుగా ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం వారికి రూ.18 వేల కనీస వేతనం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్‌ను కూడా బంద్ చేశారని విమర్శించారు. దాంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 20% తగ్గాయని చెప్పారు. దీనిపై ప్రభుత్వ చర్యలు ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్‌ను ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభిస్తారో చెప్పాలని నిలదీశారు.