హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ‘ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడానికి బొంత పురుగునైనా ముద్దాడుతా..’ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పలుమార్లు చెప్పిన ఈ మాట.. ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నది. విశాల దృక్పథంతో లక్ష్యం నిర్దేశించుకున్నాక, దాని సాధనకు ఎవరితోనైనా వేదికను పంచుకోవడానికి వెనుకాడని నాయకుడు కేసీఆర్. సైద్ధాంతికంగా భిన్న ధృవాలుగా ఉన్నవారిని సైతం ఏకం చేయగల సమర్థుడు ఆయన. కేసీఆర్ విషయంలో ప్రత్యర్థులు సైతం అంగీకరించే వాస్తవమిది. లెఫ్ట్ టు రైట్.. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు.. ఎవరినైనా కలుపుకొని పోగల అరుదైన నాయకుడు కేసీఆర్. అందుకే, నాటి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేటి బీఆర్ఎస్ వరకు కేసీఆర్ ఏనాడూ ఒంటరికాదు. ఆయనతో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ వేదికను పంచుకున్నాయి. బహుశా దేశంలోని మరే ఇతర రాజకీయ పార్టీకి, పార్టీ అధినేతకు ఈ తరహా అరుదైన రికార్డు ఉండి ఉండదు. దేశంలో విభజన రాజకీయాలు ఉన్నాయి. కమ్యూనిస్టులు ఎన్నడూ రైటిస్టు శక్తులతో కలువలేదు. అలాగే, భిన్నధృవాలుగా వ్యవహరించే రాజకీయ పక్షాలు కూడా ఎన్నో ఉన్నాయి. కనీసం ఒకరినొకరు ముఖం చూసుకునే అలవాటు కూడా లేని వైరిపక్షాలకు కొదువలేదు. అలాంటి రాజకీయాల్లో కేసీఆర్ తీరు భిన్నం.ఎవరితోనైనా స్నేహం చేయగల విశాల దృక్పథం ఆయనది. కేసీఆర్ ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషిస్తారు. ఎవరితోనైనా విభేదించినప్పుడు ఆయన ఎప్పుడూ వ్యక్తిగత ఈగోలకు వెళ్లడు. విధానాల్లోని డొల్లతనాన్నే ఎండగడుతారు. అందుకే, ఎంతటివారైనా తమ గురించి, తాము చెప్తున్న విషయాల గురించి కేసీఆర్ చేసే విశ్లేషణకు విశేష ప్రాధాన్యమిస్తారు.
కేసీఆర్‌ను సన్నిహితంగా చూసిన ఓ బీఆర్ఎస్ నేత ఆయన వ్యవహార శైలిని ప్రస్తావిస్తూ.. ‘తన ఆలోచనలను అందరితో పంచుకోవడమే కాదు, తన సంతోషాన్ని కూడా కేసీఆర్ పంచుకుంటారు. ఎవరితోనూ భేదభావనతో ఉండరు. అందుకే కేసీఆర్ దేశంలోని ప్రతి నేతతో వేదికలను పంచుకోగలిగారు. సభలు, సమావేశాల విషయంలోనే కాదు.. నాకు తెలిసినంతవరకు కేసీఆర్ ఏనాడూ ఒంటరిగా భోజనం చేసి ఉండడు. ఫలహారమైనా పదిమందితో కలిసి చేస్తారు. ఆయన అందరివాడు’ అని చెప్పారు.
కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉన్న నేతలందరికీ కేసీఆర్ స్నేహహస్తం అందించారు. దాదాపు దేశంలోని ప్రాంతీయపార్టీల నాయకులందరూ కేసీఆర్‌ను కలిసిన వారే. టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు నాటి జార్ఖండ్ ముక్తిమోర్చా అధినేత శిబూ సొరేన్ వచ్చిన విషయం తెలిసిందే. తర్వాత వరంగల్‌లో జరిగిన పార్టీ సభలకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, అజిత్‌సింగ్ హాజరయ్యారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, జేడీ(యూ) నేత కుమారస్వామి అనేక పర్యాయాలు సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన సందర్భాలనూ చూశాం. కమ్యూనిస్టు నేతలు ఏబీ బర్దన్, కేరళ సీఎం పినరాయి విజయన్ అనేకమార్లు కేసీఆర్‌ను కలిసి చర్చించారు.
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్ ప్రారంభోత్సవానికి తమిళనాడుకు చెందిన ప్రముఖ నేత, పీఎంకే నాయకుడు రాందాస్ వచ్చారు. ఇక సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ వంటివారితో కేసీఆర్ అనేక సందర్భాల్లో వేదికలను పంచుకున్నారు. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, హేమంత్ సొరేన్, నవీన్‌పట్నాయక్, మాజీ సీఎంలు ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్, మాయావతి, ప్రకాశ్‌సింగ్ బాదల్ తదితరులతోపాటు జాతీయ నేతలెందరో కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించిన సందర్భాలు కోకొల్లలు.