వీణవంక, జనవరి 19 : కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు క్వారీ వివాదం ఇంకా సద్దుమణుగక ముందే మరో క్వారీపై ఇదే మండలంలోని కొండపాక రైతులు సోమవారం తిరగబడ్డారు. దాదాపు రెండు మూడు గంటలపాటు గ్రామస్థులు, రైతులు ఆందోళనకు దిగారు. పోతిరెడ్డిపల్లిపై అనుమతి తీసుకొని కొండపాక శివారులో ఇసుక తీస్తున్నారని, తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇసుక క్వారీకి పర్మిషన్ ఇచ్చింది పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో అని, కాని కాంట్రాక్టర్ కొండపాక శివారులో సుమారు కిలోమీటరు మేర ఇసుక తవ్వకాలు చేపట్టారని ఆందోళన వ్యక్తంచేశారు. మైనింగ్ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో కాంట్రాక్టర్ ఎలాంటి హద్దులూ ఏర్పాటు చేయకుండా, నాలుగున్నర ఫీట్లకు బదులు ఏకంగా 15 నుంచి 20 ఫీట్ల లోతు తీస్తూ భూగర్భ జలాలు లేకుండా చేస్తున్నారని, ప్రమాదవశాత్తు అందులో పడితే ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొందని అన్నారు.
ఇసుక మాత్రమే తీసుకు వెళ్లాల్సిన కాంట్రాక్టర్ అక్కడ రైతులు జీవనోపాధికోసం ఏర్పాటు చేసుకున్న బోర్లు, బావులు, పైపులైన్లు ఇష్టారీతిన ధ్వంసం చేశారని, నష్టం జరుగుతుందని అడిగితే బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఓ రైతు వ్యవసాయ బావి కోసం కరెంట్ పోల్స్ వేసుకుంటే లారీలతో విరగొట్టారని, ఇదేంటని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోండని, ఏం చేస్తావో చేసుకొమ్మని బెదిరించారని వాపోయారు. అనుమతులు ఇచ్చిన చోట కాకుండా మరో చోటునుంచి ఇసుక తీయడమే కాకుండా రైతుల బావులు, బోర్లు ధ్వంసం చేశారని, పరిమితికి మించి లోతు ఇసుక తీస్తున్నారని, రానున్న రోజుల్లో మానేరువాగు ఎడారిలా మారుతుందని ఆందోళన చెందారు. మానేరులో ధ్వంసమైన రైతుల బావులు, బోర్లు పరిశీలించి విచారణ జరిగేంత వరకు క్వారీ నిలిపివేయాలని ఆర్ఐ రవి ఆదేశించారు. కాగా పోతిరెడ్డిపల్లి క్వారీకి వచ్చే వందల లారీలను రోడ్డుపైనే నిలిపి ఉంచడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రెండువైపులా లారీలు ఉండటంతో వాహనదారులు లారీల మధ్యలో నుంచి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణిస్తున్నారు.
మా ఊరి మీదుగా రాకపోకలొద్దు కలెక్టర్కు మామిడాలపల్లివాసుల వినతి
కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 19 : ‘మా గ్రామం మీదుగా వందలాది ఇసుక లారీల రాకపోకలతో ఇబ్బంది పడుతున్నాం. రోడ్డుపై నడిచేందుకు భయమేస్తున్నది. చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితైతే మరీ భయానకంగా ఉన్నది. రోడ్డు పక్కన ఉండే ఇండ్లన్నీ దుమ్ము, ధూళితో నిండిపోతున్నాయి. పంట పొలాలన్నీ మట్టి కొట్టుకుపోతున్నాయి. సింగిల్రోడ్డుపై పరిమితికి మించి ఇసుకను తరలిస్తున్న లారీలతో తాగునీటి పైపులైన్లు ధ్వంసమవుతున్నాయి’ అని కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అటు క్వారీ నిర్వాహకులు, ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సోమవారం వారు ఉపసర్పంచ్ గుడిపాటి రాజిరెడ్డితో కలిసి ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు వారు పేర్కొన్నారు.