హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు అందించే ఉచిత యూనిఫారాల కుట్టుకూలీ చార్జీలు మంజూరయ్యాయి. 24 లక్షల మంది విద్యార్థుల కుట్టుకూలీ చార్జీలుగా రూ. 24.25 కోట్లను పాఠశాల విద్యాశాఖ మంజూరు చేసింది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫారాలు సమకూరుస్తున్న విషయం తెలిసిందే. 2023- 24 విద్యాసంవత్సరానికి 24,25,812 మంది విద్యార్థులకు రెండు జతలా యూనిఫారాలు సమకూర్చింది.
ఒక్కో విద్యార్థికి కుట్టుకూలీ చార్జీలుగా రూ.100 కేటాయించగా, మొత్తం రూ. 24,25,81,200 నిధులు మంజూరు చేశారు. ఎస్సీ కాంపోనెంట్ కింద రూ. 5.82 కోట్లు, ఎస్టీ కాంపోనెంట్ రూ. 3.39కోట్లు, జనరల్ కాంపోనెంట్ రూ. 15.04కోట్ల చొప్పున మొత్తం రూ. 24.25 కోట్లను జిల్లా విద్యాశాఖ అధికారులకు (డీఈవో) మంజూరుచేశారు. ఈ నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఖాతాలకు బదిలీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన డీఈవోలకు సూచించారు.