Minister Harish rao | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు టీ డయాగ్నస్టిక్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో 10 కోట్లకు పైగా టెస్టులు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. తద్వారా 57.68 లక్షల మంది రోగులు ప్రయోజనం పొందారని చెప్పారు. శనివారం ఆయన కొండాపూర్ ఏరియా దవాఖానలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌లో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన రేడియాలజీ ల్యాబ్, న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్లను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి ప్రారంభించారు. దీంతోపాటు 8 జిల్లాల్లో పాథాలజీ, 16 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబ్స్‌ను, టీ డయాగ్నస్టిక్స్ ద్వారా 134 రకాల టెస్టులు నిర్వహించే కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానాపై నమ్మకంతో వచ్చే రోగులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు కావద్దన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ టీ-డయాగ్నస్టిక్స్‌కు రూపకల్పన చేశారని చెప్పారు. 2018 జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని, పీహెచ్సీ నుంచి అన్ని స్థాయిల దవాఖానాల్లో ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
టీ డయాగ్నస్టిక్స్‌లో ఇప్పటివరకు 57 రకాల పాథాలజీ (రక్త,మూత్ర) పరీక్షలు నిర్వహిస్తుండగా వీటి సంఖ్యను 134కు పెంచామని వెల్లడించారు. దీంతో ఎక్స్‌రే, యూసీజీ, ఈసీజీ, 2డీ ఎకో, మామోగ్రామ్ వంటి రేడియాలజీ పరీక్షలు కూడా పూర్తి ఉచితంగా లభిస్తాయని వివరించారు. ఆయా పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్‌ల్లో రూ.500 నుంచి రూ.10 వేల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. రేడియాలజీ ల్యాబ్‌లా ద్వారా మహిళలకు సంబంధించిన క్యాన్సర్ పరీక్షలు, హైఎండ్ అల్ట్రా సౌండ్, ఇతర స్కానింగ్‌లను ఉచితంగా చేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఒక్కో రేడియాలజీ, పాథాలజీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4.39 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. 134 పరీక్షలు నిర్వహించేందుకు మరో రూ.1.70 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తున్నదని తెలిపారు. దీంతో ఒక్కో హబ్ ఏర్పాటుకు రూ.6.09 కోట్ల చొప్పున వ్యయం అవుతున్నదని వివరించారు. గతంలో ఒక్కో ల్యాబ్ నిర్వహణకు ఏటా రూ.2.40 కోట్లు ఖర్చు కాగా, ఇప్పుడు అదనంగా రూ.60 లక్షల భారం పడుతుందని చెప్పారు. మొత్తంగా ప్రభుత్వం ఏటా రూ.3 కోట్లను వెచ్చిస్తున్నదని వెల్లడించారు.
24 గంటల్లోనే టెస్టుల రిపోర్ట్స్
ఇకనుంచి రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలోని దవాఖానలో శాంపిల్స్ ఇచ్చినా వాటిని టీ డయాగ్నస్టిక్స్ సెంటర్లో ప్రాసెస్ చేసి 24 గంటల్లోగా పరీక్షా ఫలితాలను వైద్యులకు, రోగులకు మొబైల్ ఫోన్ ద్వారా అందిస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. హైదరాబాద్‌లోని సెంట్రల్ ల్యాబ్‌లో నాణ్యత ప్రమాణాలు అత్యుత్తమంగా పాటిస్తున్నారంటూ ఇప్పటికే ఎన్ఏబీఎల్ నుంచి సర్టిఫికెట్ వచ్చిందని తెలిపారు. 13 జిల్లా ల్యాబ్‌లు ఎన్ఏబీఎల్ ప్రాథమిక అక్రెడిటేషన్ సాధించాయని వెల్లడించారు. ఒకప్పుడు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలకు వెళ్లాల్సి వచ్చేదని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయిందని, సమీపంలోనే 350 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 దవాఖానాలు సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు. మరే ఇతర రాష్ర్టాల్లో లేని విధంగా ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించడంతోపాటు అత్యంత ఆధునాతమైన వైద్య సేవలను ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో అట్టడుగున వైద్యసేవలు
కాంగ్రెస్ పాలనలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ అనే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ‘నేను సర్కార్ దవాఖానకే పోతా..’ అనే రోజులను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని హరీశ్‌రావు కొనియాడారు. ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు వచ్చే విధంగా ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్య మహిళ, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ లాంటి పథకాలతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు రెట్టింపు అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ దవాఖానల్లో 30% కాన్పులు అయితే, ఇప్పుడు 70 శాతానికి పెరిగాయని ఇది తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అందించిన సేవలతో పోల్చితే చాలా మార్పు వచ్చిందని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ నలుదిక్కులా కొత్తగా పెద్ద దవాఖానలను నిర్మిస్తున్నామని, నిమ్స్‌ను సైతం మరో 2వేల పడకలతో విస్తరిస్తున్నామని తెలిపారు. నిమ్స్‌లో అత్యాధునిక టెక్నాలజీ వైద్య సేవలు అందించే రోబోటిక్ ఎక్విప్మెంట్స్ తెస్తున్నామని వెల్లడించారు.
వైద్యులకు శుభాకాంక్షలు
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి హరీశ్‌రావు వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యులు అందిస్తున్న సేవలను కొనియాడారు. వైద్యులు మెరుగైన సేవలను అందించడం వల్ల ఆరోగ్య తెలంగాణ దిశగా వెళ్తున్నామని పేర్కొన్నారు. మన వైద్యులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, రాష్ట్ర టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
31 జిల్లాల్లో టీ డయాగ్నస్టిక్స్ సేవలు
నారాయణపేట, మేడ్చల్ మినహా 31 జిల్లాల్లో టీ డయాగ్నస్టిక్స్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే ఆ రెండు జిల్లాలోనూ అందుబాటులోకి తీసుకొస్తాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని పీహెచ్‌సీల్లో 134 రకాల పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.
– మంత్రి హరీశ్‌రావు
31 జిల్లాల్లో టీ డయాగ్నస్టిక్స్ సేవలు
నారాయణపేట, మేడ్చల్ మినహా మిగతా 31 జిల్లాల్లో టీ డయాగ్నస్టిక్స్ సేవలు ఈ రోజు నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే ఆ రెండు జిల్లాలోనూ అందుబాటులోకి తీసుకొస్తాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని పీహెచ్‌సీల్లో 134 రకాల పరీక్షలు చేసే కార్యక్రమం ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటు దవాఖానల్లో ఏ విధమైన సేవలు, పరికరాలు ఉంటాయో అవన్నీ ఇప్పుడు ప్రభుత్వ దవాఖానల్లో ఉన్నాయి. ఇక్కడ లేవనే మాటకు చోటు లేకుండా చేశాం. పేదలు ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు పొందేలా ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలి.
– వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
టీ డయాగ్నస్టిక్స్ విశేషాలు