Rythu Discom | హైదరాబాద్, మే 29 (నమస్తేతెలంగాణ): ‘రైతుల పేరిట ఉచిత విద్యుత్తును ఇతరులు వాడుకుంటున్నారని సర్కార్ చెప్పడం దుర్మార్గం. అంటే అన్నదాతలను సర్కార్ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదా? దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైనట్టేనా? అసలు ఫ్రీ కరెంట్ ఇస్తుంటే చౌర్యానికి అవకాశం ఎక్కడిది? ఈ విషయంలో రైతులు ఎక్కడైనా పట్టుబడ్డరా?’ అని విద్యుత్తు శాఖ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ఘాటుగా ప్రశ్నాస్ర్తాలను సంధించారు. రైతు డిస్కమ్ ఏర్పాటుపై ఎలక్ట్రిసిటీ రెగ్యులెటరీ కమిషన్ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ విచారణకు బీఆర్ఎస్ తరఫున ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సమర్థంగా వాదనలు వినిపించారు. అనేక సందేహాలను లేవనెత్తారు. రాతపూర్వకంగా అభ్యంతరాలు వ్యక్తంచేశారు. రైతుడిస్కమ్ ఏర్పాటులో చీకటి కోణాలను ఎండగట్టారు. ప్రభుత్వ కుట్రలను బహిర్గతం చేశారు. నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకే కొత్త డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం సిగ్గుచేటని నిగ్గుతేల్చారు. అంటే ఇంతకాలం నాణ్యమైన కరెంట్ ఇవ్వలేదా? ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పింది బూటకమేనా? అని నిలదీశారు.
అనుమతుల్లేకుండా ఎలా ప్రారంభిస్తారు?
ఈఆర్సీ అనుమతిలేకుండా రైతు డిస్కమ్‌ను ఏవిధంగా ప్రారంభిస్తారని జగదీశ్‌రెడ్డి నిలదీశారు. దీనిపై ఓవైపు ఈఆర్సీ అభ్యంతరాలు స్వీకరిస్తుంటే మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం వచ్చే జూన్ 2న ప్రారంభిస్తామని హడావుడి చేయడంలోని అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ చర్య చట్టబద్ధమైన సంస్థలను నిర్వీర్యం చేయడమేనని ధ్వజమెత్తారు. కొత్తడిస్కమ్ లైసెన్స్‌కు ఎట్టిపరిస్థితుల్లో అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. వెయ్యిమందితో కొత్తడిస్కంను నిర్వహించడం, 30 వేల మంది రైతులకు సేవలందించడం సాధ్యమవుతుందా? అని సందేహం వ్యక్తంచేశారు.
రైతులను బలిచేసే కుట్ర: నిరంజన్‌రెడ్డి
రైతు డిస్కమ్ పేరిట కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని బలిచేసే కుట్రలకు పాల్పడుతున్నదని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. పిల్ల పుట్టకముందే కుల్లకుట్టిన చందంగా.. లైసెన్స్ రాకముందే లోగో విడుదల చేయడం, జూన్ 2నుంచి అమల్లోకి వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం శోచనీయమని పేర్కొన్నారు. ఇది బాధ్యాతారహిత్యం కాదా? అని ప్రశ్నించారు. ఈఆర్సీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వినియోగదారుల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండున్నరేండ్ల కాలంలో హైటెన్షన్ లైన్ల నిర్మాణం ఎక్కడా జరుగలేదని చెప్పారు. డ్రింకింగ్ వాటర్ సిస్టం, మున్సి పాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇచ్చే కనెక్షన్లను రైతుడిస్కంలో చేర్చడం ఆక్షేపణీయమని, ఈ చర్య ముమ్మాటికీ రైతాంగానికి ఉరిపెట్టడమేని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను సరిదిద్దకుండా కొత్త సిస్టమ్‌ను తీసుకొచ్చి నష్టాలను అంటగట్టడం ద్వారా ప్రయోజనమేమిటని నిలదీశారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు ప్రక్రియ మున్ముందు సాగు కనెక్షన్ల వద్దకు పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఇప్పటికే అదానీకి చెందిన కంపెనీకి కాంట్రాక్ట్ అప్ప గించినట్టు వార్తలు వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆయా అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్తు రంగంపై నాడు కేసీఆర్ ప్రత్యేక దృష్టి
తెలంగాణ సిద్ధించిన తర్వాత పదేండ్ల తన పాలనలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్తు రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టి, సుమారు రూ.లక్ష కోట్లు వెచ్చించారని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. 2014లో 7,756 మెగావాట్లుగా ఉన్న విద్యుత్తు ఉత్పత్తిని 2023 నాటికి 18,756 మెగావాట్లకు పెంచిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. 6,600 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను 15,495 వేలకు తీసుకుపోయారని వెల్లడించారు. దినసరి వినియోగాన్ని 124 మిలియన్ యూనిట్ల నుంచి 298 మిలియన్ యూనిట్లకు, 1,096 యూనిట్ల తలసరి వినియోగాన్ని 2,140 యూనిట్లకు తీసుకెళ్లారని వివరించారు.
‘అసెంబ్లీలో చర్చించండి’
నష్టంవచ్చే డిస్కమ్‌కు రైతుపేరు పెట్టడం అభ్యంతరకరమని, ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇంతటి కీలకమైన అంశంపై అన్నివర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని, అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్లాలని డిమాండ్ చేశా రు. ఈ ప్రతిపాదనలో చట్టపరమైన లోపాలు, ఆర్థికంగా ఇబ్బందులున్న దృష్టా కొత్త డిస్కమ్ ప్రతిపాదనను బీఆర్ఎస్ తరఫున నిర్ధ్వంద్వంగా తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. ఆర్డీఎస్ఎస్లో చేరడం ఆప్షన్ మాత్రమేనని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను తిరస్కరించిందని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత రేవంత్ సర్కార్ కేంద్రం ప్రతిపాదించిన స్కీమ్‌లోకి ఎందుకు తహతహలాడుతున్నదో అర్థం కావడంలేదని పేర్కొన్నారు. బడా కంపెనీలకు మన విద్యుత్తు రంగాన్ని అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నదనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ఆదాయం వచ్చే డిస్కమ్‌లను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
ఉచిత విద్యుత్తు రద్దుకు కుట్రలు
దేశంలో ఎక్కడాలేని విధంగా సాగుకు 24 గంటలు ఇస్తున్న ఉచిత విద్యుత్తు స్కీమ్‌ను రద్దుచేసేందుకే ప్రభుత్వం రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని తెరపైకి తెచ్చిందని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. దీనిని రైతుల ప్రయోజనాల కోసమే తెచ్చామని చెప్పడం పూర్తి అబద్ధమని పేర్కొన్నారు. ఈ ముసుగులో ట్రాన్స్ఫార్మర్ల వద్ద స్మార్ట్‌మీటర్లు పెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదని దుయ్యబట్టారు. మొత్తంగా విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నదని విరుచుకుపడ్డారు. రైతు డిస్కమ్ పేరిట ఏర్పాటు చేస్తున్న సంస్థ రైతాంగాన్ని చీకట్లోకి నెట్టి ఉరివేసే డిస్కమ్‌గా అభివర్ణించారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్త డిస్కమ్‌కు ఈఆర్సీ అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.