హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులను కా్రంగెస్ సర్కార్ దారుణంగా మోసం చేసింది. వీరి సంక్షేమం సంగతి అటుంచి.. ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్కార్డులిస్తామని చెప్పి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పూర్తిగా విస్మరించింది. ఉద్యోగుల హెల్త్‌కార్డులపై ఎట్టకేలకు ఓ ముందడుగు పడింది. జూలై 15 నుంచి ఈహెచ్ఎస్ స్కీం మొదలుకానుంది. కాగా తమ సంగతేమిటని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తమకూ హెల్త్కార్డులివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
జర్నలిస్టులకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హెల్త్కార్డులే ఇంకా నడుస్తున్నాయి. అయితే ఈ కార్డులతో ప్రైవేట్ దవాఖానల్లో ఉచిత వైద్యం అందడంలేదు. ఒక్క నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి దవాఖానల్లో మాత్రమే ఈ కార్డులను అనుమతిస్తున్నారు. మరోవైపు జర్నలిస్టులు ప్రివిలేజ్‌గా భావించే అక్రెడిటేషన్ కార్డులకు కాంగ్రెస్ సర్కార్ కోతపెట్టింది. కేసీఆర్ హయాంలో అక్రెడిటేషన్ పొందిన జర్నలిస్టుల సంఖ్య 42 వేలు కాగా.. ఈ ఏడాది 25 వేల మంది దరఖాస్తు చేసుకుంటే 16 వేల మందికే కార్డులు వచ్చాయి.
‘జర్నలిస్టు హెల్త్ స్కీంను అమలు చేస్తాం. వారితోపాటు కుటుంబ సభ్యులందరికీ మెరుగైన వైద్యం అందేలా చూస్తాం. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం. మరణించిన జర్నలిస్టులకు ఐదు లక్షల పరిహారాన్ని అందజేస్తాం’ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి అనేక హామీలను కాంగ్రెస్ గుప్పించింది. అధికారంలోకి వచ్చాక.. వాటిని పూర్తిగా విస్మరించింది. కేసీఆర్ సర్కార్ జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించింది. కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందించింది. నెలవారీ పెన్షన్లు, ప్రమాద బీమా, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికంగా వెన్నుదన్ను, విద్యాసహాయం పథకాలను విజయవంతంగా అమలుచేసింది.