Gruha Jyothi | సూర్యాపేట, జూలై 27 (నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కారు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు పథకం క్షేత్రస్థాయిలో అబాసు పాలవుతున్నది. కాంగ్రెస్ ఆరు హామీల్లో ఒకటైన గృహజ్యోతి వేలాది మంది అర్హుల ఇండ్లల్లో వెలుగులు నింపలేకపోతున్నది. రెండు వందల యూనిట్లలోపు రీడింగ్ వచ్చే విద్యుత్తు వినియోగదారులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని పైకి గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదు. గృహలక్ష్మి పథకం కోసం సూర్యాపేట జిల్లాలో 2,59,697 మంది విద్యుత్తు వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,64,479 మందిని అర్హులుగా ప్రకటించగా, మిగిలిన దరఖాస్తుల పరిశీలనను ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేశారు. నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఆమోదించడం లేదు. అదనంగా మరో 25 వేలకుపైగా దరఖాస్తులు అందినట్టు సమాచారం. ఈ లెక్కన జిల్లాలో దాదాపు 1.20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వారందరిని నాలుగు నెలలుగా విద్యుత్తు శాఖ బిల్లులు అడగడం లేదు. అంతా 200 యూనిట్ల రీడింగ్ ఉన్నవాళ్లే కావడంతో జీరో బిల్లు పరిధిలోకి వస్తామని భావించి వినియోగదారులు ధీమాగా ఉన్నారు. తీరా ఇప్పుడు విద్యుత్తు శాఖ బిల్లుల కోసం ఇంటి గడప తొక్కుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. నాలుగు నెలలది కలిపి రూ.2 వేల నుంచి రూ.3,600 వరకు బకాయి ఉన్నది, కట్టాంటూ ఒత్తిడి చేస్తున్నారు. అలా పెండింగ్లో ఉన్న మొత్తాన్ని చెల్లించని చాలామంది వినియోగదారుల ఇంటి కరెంట్ కనెక్షన్లను శనివారం విద్యుత్తు సిబ్బంది కట్ చేశారు. 200 యూనిట్లలోపే కరెంట్ వాడుతున్నామని చెబుతున్నా వినిపించుకోవడం లేదంటూ కాంగ్రెస్ సర్కారు తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నేను దివ్యాంగుడిని. సూర్యాపేట పట్టణంలోని నిర్మల దవాఖాన ఎదురుగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ అమలు ప్రారంభించడానికి నెల ముందు వరకు కూడా గృహ వి నియోగ కనెక్షన్ ఎన్నడూ 100 యూనిట్లు దాటలేదు. రూ.500 లోపే బిల్లు వచ్చేది. ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వస్తున్నది. ఇదేందని కరెంటోళ్లను ప్రశ్నిస్తే మీరు ఎక్కువ కరెంట్ వాడుతున్నారని అంటున్నారు. కరెంట్ బిల్లు ఇంటి దగ్గరే వసూలు చేసి రశీదు కూడా ఇస్తలేరు. ప్రతి నెలా బిల్లు ఎక్కువ వస్తుందంటే.. మా దగ్గర ఎంత ఉంటే అంత కట్టించుకుని మిగతాది వచ్చే నెల కడుదువులే అని వెళ్తున్నారు. ఈ నెల కూడా రూ.4,695 బిల్లు వచ్చింది. దానికి సంబంధించి ఈ నెల 12న రూ.3,150 కట్టించుకున్నారు. మిగతాది వచ్చే నెల దాంట్లో కలిపి కట్టాలని చెప్పారు. శనివారం మధ్యాహ్నం వచ్చి చెప్పకుండానే కరెంట్ సరఫరా నిలిపివేశారు. జీరో బిల్లు మాట దేవుడెరుగు.. వచ్చే బిల్లు కట్టలేక చావుకొస్తున్నది. – నజీర్ పాషా, సూర్యాపేట టౌన్