Yang Liu | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): త్వరలోనే హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల దిగ్గజం ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూ హామీ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించేందుకు ఫ్యూచర్ సిటీ పేరిట ఫోర్త్ సిటీకి రూపకల్పన చేస్తున్నామని సీఎం వివరించారు. విద్య, వైద్యం, క్రీడలు, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, సిల్ డెవలప్మెంట్ వంటి బహుముఖ అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ పెంచేందుకు యంగ్ ఇండియా సిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ఫోర్త్‌సిటీలో ఫాక్స్‌కాన్ సంస్థ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అనుమతులతో పాటు అవసరమైన మద్దతు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యాంగ్ లియూ మాట్లాడుతూ.. ఫోర్త్‌సిటీ ప్రతిపాదన బాగున్నదని, త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని చెప్పారు. ముందుగా చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, భారతదేశ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేశ్‌రంజన్, డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.