హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): పురపోరులో 12,944మంది బరిలో నిలిచారు. మెజారిటీ స్థానాల్లో చతుర్ముఖ పోటీ నెలకొన్నది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియడంతో బుధవారం తుది అభ్యర్థుల జాబితా ఖరారైంది. మొత్తం 123 చోట్ల ఎన్నికలు జరుగనుండగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని 2,996 వార్డుల్లో 12,944మంది పోటీలో ఉన్నట్టు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను మున్సిపాలిటీ వార్డులవారీగా, పార్టీల వారీగా వేర్వేరు జాబితాలను విడుదల చేసింది.
తిరుగుబాటు అభ్యర్థులు(రెబల్స్) చాలాచోట్ల పార్టీలకు సవాల్‌గా మారినట్టు తెలుస్తున్నది. అధికార కాంగ్రెస్ నుంచి 2,948మంది, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి 2,878, బీజేపీ నుంచి 2,634, జనసేన పార్టీ(జేఎస్పీ) నుంచి 332, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి(ఏఐఎఫ్బీ) 288, ఎంఐఎం నుంచి 282మంది, ఇతరులు పోటీలో ఉన్నారు. ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 796 మంది ఉండగా, స్వతంత్ర అభ్యర్థులు 2,786 మంది పోటీలో ఉన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ
ఈ ఎన్నికల్లో సగటున ఒక్కో సీటుకు నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉండేలా కనిపిస్తున్నది. ముఖ్యంగా వామపక్షాల పొత్తులతో అన్ని స్థానాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో హోరాహోరీ పోరు వీరిద్దరి మధ్యే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్‌లో 30 వార్డులకు గాను బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, పార్టీలు అన్ని స్థానాల్లోనూ 30చొప్పున తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. తమ ప్రభావం ఉన్న మున్సిపాలిటీల్లోనే బీజేపీ, ఎంఎంఐ, ఏఐఎఫ్బీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎంఐఎం తనకు ప్రభావం ఉన్న ఆదిలాబాద్‌లో 19, జగిత్యాలలో 8, కోరుట్లలో 13మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. 11న జరిగే పోలింగ్‌లో సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకోనున్నారు.
14 వార్డులు ఏకగ్రీవం
రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లోని 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 123 పట్టణ స్థానిక సంస్థల్లోని 2,996 వార్డులు/డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 14 చోట్ల పోటీ లేకపోవడంతో అవి ఏకగ్రీవంగా మారాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలోని 11, 21, 31వ వార్డులు, హుజూర్‌నగర్‌లోని 3వ వార్డు, మెదక్‌లోని 32వ వార్డు, వికారాబాద్ మున్సిపాలిటీలోని 1వ, 15వ వార్డు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో 10వ వార్డు, చౌటుప్పల్‌లో 17వ వార్డు, మెదక్‌లోని 32వ వార్డు, నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలోని 10వ వార్డు, జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని 10వ వార్డు, ఖమ్మం జిల్లా ఎదులాపురంలోని 15 వార్డు ఏకగ్రీవమయ్యాయి. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని 58వ డివిజన్, పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లోని 1వ డివిజన్ ఏకగ్రీవమైంది. అలంపూర్ 10 వార్డుతో పాటు వికారాబాద్ 15వ వార్డును బీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకోగా, మిగతా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఏకగ్రీవాలు పోను, మిగిలిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Pp