Robbery | రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. ఓ వ్యాపారి 40 లక్షలను తీసుకెళ్తున్నాడనే సమాచారంతో అతడి కారును పలువురు దుండగులు వెంబడించారు. వ్యాపారి కారును ఢీకొట్టడమే కాకుండా, అతని కళ్లలో కారం జల్లి డబ్బులు తీసుకుని పారిపోయారు. ఈ క్రమంలో దుండగులు ప్రయాణిస్తున్న కారు సైతం బోల్తాపడింది. అప్పటికే స్థానికులు వెంటపడుతుండటంతో కారును అక్కడే వదిలేసి అందినకాడికి డబ్బులు తీసుకుని పరారయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ స్టీల్ వ్యాపారి రూ. 40 లక్షలు తీసుకుని ఫోర్డ్ ఫిగో (TS 09 UD 0093) కారులో వికారాబాద్ నుంచి హైదరాబాద్కు బయల్దేరాడు. ఇది తెలుసుకున్న కొందరు దుండగులు స్విఫ్ట్ డిజైర్ కారులో వారిని వెంబడించారు. ఈ క్రమంలోనే ముందు వెళ్తున్న వారి కారును ఢీకొట్టారు. అప్పుడు ముందు కారు ఆగడంతో రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు. అనంతరం వ్యాపారి కళ్లలో కారం కొట్టి బొమ్మ తుపాకీతో బెదిరించి, 40 లక్షల నగదు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వ్యాపారి నుంచి డబ్బు దోపిడీ చేసి పారిపోతున్న క్రమంలో దుండగులు ప్రయాణిస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పింది. శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో వారి కారు బోల్తా పడింది. అప్పటికే స్థానికులు వెంటపడుతుండటంతో తమ కారును, సామగ్రిని వదిలేసి.. అందినకాడికి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు, బొమ్మ తుపాకీతో పాటు కత్తి, కారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. కారు నంబర్, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.