కుభీర్, జూన్ 6 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం అంతర్ని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం కూలడంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బడిబాట ప్రారంభంరోజే ప్రమాదం జరగడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం ప్రారంభమవడంతో ఉదయమే హెచ్ఎం సుభాష్, సహ ఉపాధ్యాయుడు కత్తి నాగోరావు పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో కలిసి ర్యాలీ తీశారు. అనంతరం ఉపాధ్యాయులు కుభీర్‌లోని విద్యావనరుల కేంద్రానికి వెళ్లి పాఠ్యపుస్తకాలు తీసుకొచ్చి పాఠశాలలో ఉంచి మధ్యాహ్నం వెళ్లిపోయారు. కొందరు విద్యార్థులు పాఠశాల భవనం వద్ద ఆడుకుంటున్నారు.
అదే సమయంలో శిథిలావస్థలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఇటుకలు పడటంతో విద్యార్థులు జీ ప్రేమ్‌కు తలకు తీవ్ర గాయమవగా, సాయికుమార్ కాలు విరిగింది. ప్రణయ్, అభినయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో భైంసా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ సమస్యపై జనవరి 29న నమస్తే తెలంగాణ జిల్లా పేజీలో ‘ఐదు తరగతులకు ఒకే గది’ శీర్షికన కథనం ప్రచురితం కాగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా జనవరి 30న జరిగిన పోషకుల సమావేశంలో శిథిలమైన పాఠశాల భవనాన్ని కూల్చివేయాలని తీర్మానం చేసి డీఈవోకు పంపించారు. అయినప్పటికీ భవనం కూల్చివేతకు చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఘటన జరిగిందని, అధికారులు నిర్లక్ష్యం వహించారని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు.