తప్పుడు నివేదికలు ఇచ్చారని కలెక్టర్ చర్యలు
నాగర్కర్నూల్, జూలై 23 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో ఇండ్ల నిర్మాణ పనుల్లో తప్పుడు నివేదికలు తయారుచేయడంతోపాటు అలసత్వం ప్రదర్శించిన నలుగురు పంచాయతీ కార్యదర్శులపై వేటుపడింది. బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లి గ్రామ కార్యదర్శి ఎం బాలరాజు, బిజినేపల్లి మండలం గంగారం కార్యదర్శి టీ నరేందర్రెడ్డి, ఇదే మండలం అల్లీపూర్ కార్యదర్శిc, ఊర్కొండ మండలం గుడిగానిపల్లి కార్యదర్శి దండు రాంచంద్రయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాత పునాదికి మార్కవుట్ ఇవ్వడం, కొత్త ఇండ్లకు బదులుగా పాత పునాదుల వద్ద ఫొటోలు తీయడం, కొలతల్లో తేడాలు ఉన్న కారణంగా వీరిని సస్పెండ్ చేసినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దళారులను నమ్మొద్దు ; ఇందిరమ్మ ఇండ్లపై హౌసింగ్ఎండీ గౌతం సూచన
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరుగుతున్నదని, ఇందులో ఎటువంటి మధ్యవర్తులకు, సిఫారసులకు తావులేదని గృహనిర్మాణ శాఖ ఎండీ గౌతం స్పష్టంచేశారు. కొందరు ఇంటి మంజూరీ కోసం మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటివారిని నమ్మరాదని సూచించారు. ప్రలోభాలకు గురిచేసేవారిపై ఫిర్యా దు చేయాలని కోరారు. సొంత స్థలం లేనివారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు.