నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 27: నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన కూలీలు కలెక్టరేట్ వద్ద నిర్మిస్తున్న ఐటీ హబ్లో పని చేస్తున్నారు.
నిత్యం గ్రామం నుంచి వచ్చి పనులు ముగించుకొని తిరిగి వెళ్తున్నారు. రోజు మాదిరిగానే పనులు ముగించుకొని ఆటోలో తిరిగి వెళ్తున్నారు. అర్సపల్లి బైపాస్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు రాగానే అర్సపల్లి నుంచి ఎదురుగా వచ్చిన బొలేరో పికప్ వ్యాన్ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోడ్రైవర్ ఆర్ ప్రశాంత్(35), కూలీలు డీ చరణ్(25), డీ శ్యామ్(48), ఆర్ రేఖ(32) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వీరితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు.