మూసాపేట/టేకుమట్ల, అక్టోబర్ 13 : వేర్వేరు చోట్ల నీటిలో మునిగి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలు మహబూబ్నగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం స్ఫూర్తితండాకు చెందిన సక్రూనాయక్, జ్యోతికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. శనివారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్దకు వారి ఇద్దరు కుమారులు సాయినాయక్ (13), సాకేత్నాయక్ (9) వెళ్లారు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో సక్రూనాయక్ పొలం వద్ద వెతికాడు. కనిపించకపోవడంతో తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలో ఉన్న నీటిగుంతలో పరిశీలించగా కుమారులు ఇద్దరూ మునిగిపోయి కనిపించారు. వారిని బయటకు తీసి వెంటనే జిల్లా దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు మూసాపేట ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని టేకుమట్ల- రాఘవారెడ్డి పేట గ్రామాల మధ్యలోని వంతెన వద్ద చలివాగులో మునిగి ఆదివారం ఇద్దరు మృతి చెందారు. వెల్లంపల్లికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు సొల్లేటి రాములు(45) కుటుంబంతోపాటు గీస హరీశ్ (28), మరికొందరు కలిసి సరదాగా స్నానాలు చేద్దామని చలివాగు వద్దకు వెళ్లారు. రాములు, హరీశ్ వాగు కోతకు గురైన ప్రాంతంలో ఈత కొడుతుండగా లోతుగా ఉన్నచోట ప్రమాదవశాత్తు హరీశ్ పడిపోయాడు. గమనించిన రాములు కాపాడే ప్రయత్నంలో వాగు ప్రవాహానికి ఎదురు ఈదలేక ఇద్దరూ మునిగిపోయారు. వారి కుటుంబసభ్యులు కేకలు వేయగా స్థానికులు, జాలర్లు వెలికితీయగా అప్పటికే మృతి చెందారు.