కోరుట్ల/మన్సూరాబాద్, జూన్ 15: వేర్వేరు చోట్ల జరిగిన విద్యుత్తు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. గణపతి విగ్రహం విద్యుత్తు తీగలకు తగలడంతో జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇద్దరు, హైదరాబాద్ శివారులోని సాగర్ రింగ్‌రోడ్డు వద్ద 11కేవీ విద్యుత్తు తీగలు తెగిపడటంతో ఇద్దరు యాచకులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… కోరుట్ల పట్టణంలోని మెట్పల్లి రోడ్డులో శ్రీబాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రాన్ని అల్వాల వినోద్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 12 ఫీట్ల వినాయక విగ్రహాన్ని ఎండలో ఆరబెట్టారు. వర్షం వస్తుందనే అనుమానంతో మరో షెడ్లోకి తరలించేందుకు కార్మికుల సహాయం తీసుకున్నాడు. గణేశ్ విగ్రహాన్ని మోసుకెళ్తుండగా 11/33 కేవీ విద్యుత్తు తీగలకు విగ్రహం తగిలింది. విగ్రహం తడిగా ఉండటంతో మంటలు వచ్చాయి. దీంతో విగ్రహాన్ని తరలిస్తున్న 9 మంది కార్మికులతోపాటు నిర్వాహకుడు వినోద్ కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దవాఖానకు తరలిస్తుండగా వినోద్, బంటి అలియాస్ సాయికుమార్ మార్గమధ్యంలో మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ ఎనిమిది మందికి కోరుట్ల దవాఖానలో ప్రాథమిక చికిత్స అందించి, జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ఇద్దరు యాచకులు మృతి
గ్రేటర్ హైదరాబాద్‌లోని సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో 11 కేవీ విద్యుత్తు తీగలు తెగిపడటంతో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు యాచకులు సజీవదహనమయ్యారు. స్థానిక బాబాయి హోటల్ ఎదురుగా ఉన్న రేణుక ఎల్లమ్మ దేవాలయం ముందు ఫుట్‌పాత్‌పై రోజూ ఇద్దరు యాచకులు నిద్రిస్తుంటారు. శనివారం రాత్రి కూడా ఆ ఇద్దరు అక్కడే ఫుట్ పాత్‌పై నిద్రించారు. అర్ధరాత్రి 1.50 గంటల సమయంలో పెద్ద శబ్దంతో 11 కేవీ విద్యుత్తు వైరు తెగి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కుక్కపై పడ్డాయి. షాక్ ప్రభావంతో కుక్క ఎగిరి గెత్తేసింది. అవే తీగలు పక్కనే నిద్రిస్తున్న ఇద్దరు యాచకులపై పడ్డాయి. దీంతో కుక్కతోపాటు ఆ యాచకులిద్దరు అక్కడికక్కడే కాలిన గాయాలతో మృతి చెందారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు.