జనగామ చౌరస్తా/ఆర్కేపురం/కొండాపూర్, సెప్టెంబర్ 27 : వేర్వేరు చోట్ల లంచం తీసుకుంటూ శుక్రవారం నలుగురు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. జనగామలో ఆర్అండ్బీ ఈఈ, ఏటీవో, సరూర్‌నగర్‌లో వీఎం హోం ప్రిన్సిపల్ సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు దొరికారు. వివరాలు ఇలా.. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం బండ్లగూడెం కు చెందిన ఎక్స్ సర్వీస్‌మెన్ చిర్ర సత్యపాల్‌రెడ్డి భార్యకు లింగాలఘనపురంలో హిందూస్థాన్ పెట్రోలియం బంక్ మంజూరైంది. దాని స్థాపనకు అవసరమయ్యే ఎన్వోసీ కోసం వరంగల్ పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోగా, రిమార్క్స్ పరిశీలన కోసం జనగామ ఆర్అండ్బీ ఈఈ, డీపీవో, ఏసీపీకి ఉత్తర్వు లు జారీ చేశారు. దీంతో ఈఈ చిలుకపాటి హుస్సేన్ ఎన్వోసీ జారీ చేయడానికి సత్యపాల్‌రెడ్డిని 14 వేలు లంచం డిమాండ్ చేయగా ఏసీబీని సంప్రదించారు. శుక్రవారం జనగా మ కలెక్టరేట్లోని కార్యాలయంలో ఆర్అండ్బీ ఈఈ హుస్సేన్ సత్యపాల్‌రెడ్డి నుంచి రూ.12 వేలు తీసుకొని మరో రూ.2 వేలను ఏటీవో రవీందర్‌కు ఇప్పించాడు. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సరూర్‌నగర్ వీఎం హోం ప్రిన్సిపాల్ ప్రభుదాస్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పాఠశాల ఫుడ్ కాం ట్రాక్టర్ బిల్లుకు ప్రిన్సిపల్ వాస్తవ బిల్లుల కన్నా రూ.29 వేలు అధిక బిల్లులు సృష్టించా డు. మొత్తాన్ని శుక్రవారం కాంట్రాక్టర్ నుంచి తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన మాచేపల్లి అప్సరకు ఓనర్ షిప్ సర్టిఫికెట్ ఇవ్వడానికి పంచాయతీ కార్యదర్శి రూ.7 వేలు లంచం డిమాండ్ చేశాడు. శుక్రవారం అప్సర నుంచి కార్యదర్శి షకీల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యదర్శిని అదుపులోకి తీసుకున్నారు.