హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్ విభాగంలో మళ్లీ పైరవీలకే పెద్దపీట వేశారు. అర్హత కలిగిన వారిని కాదని, అనుకూలమైన వారికే అందలం ఎక్కించేందుకు రంగం సిద్ధమైంది. నలుగురు నాన్‌క్యాడర్ ఎస్సీలకు ఐపీఎస్‌లుగా ప్రమోషన్ కల్పించేందుకు నిర్ణయించారు. పోలీస్ అధికారుల ట్రాక్ రికార్డులను పక్కనబెట్టి, పలు ఆరోపణలున్న వారితోనే జాబితా రెడీ అయింది. ఇప్పటికే బదిలీలు, పదోన్నతుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్న నేపథ్యంలో తాజా ఘటనతో అవకతవకలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర సర్వీసుల నుంచి ఈసారి నలుగురికి ఐపీఎస్ రానున్నట్టు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి సమాచారం ఇచ్చింది. నాలుగు పోస్టులకు పేర్లను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఒక్కొక్క పోస్టుకు ముగ్గురేసి పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జాబితాను పంపించింది. అధికారుల మెరిట్, ట్రాక్ రికార్డుల ఆధారంగా కేంద్రానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపే పేర్లను యూపీఎస్సీలోని సెలెక్షన్ కమిటీ వడపోసి నలుగురు పేర్లను ఖరారు చేస్తుంది. ఆ నలుగురి పేర్లతో కేంద్ర హోంశాఖ గెజిట్ కూడా విడుదల చేస్తుంది. మొత్తంగా 12 మందితో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆ 12 పేర్లపై యూపీఎస్సీ సెలక్షన్ కమిటీ ఆగస్టు 27న ప్రత్యేకంగా భేటీ అయింది. ఆ కమిటీ నాలుగు పేర్లపై తుదినిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రేపో మాపో దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది.
ఆ డీసీపీ షాడో సీఎంకు దగ్గర
నగర శివారులో డీసీపీగా పనిచేసే ఓ అధికారిణి పేరు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆ అధికారిణిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. షాడో సీఎంకు చాలా దగ్గర అని పేరున్న ఆ డీసీపీ.. చుట్టుపక్కల ఉన్న మరో ఇద్దరు డీసీపీలతో కలిసి చేయని దందా అంటూ లేదని పోలీస్ వర్గాలే కోడై కూస్తున్నాయి. ఇవే విషయాలను ఊటంకిస్తూ రాష్ట్ర ఇంటెలిజన్స్ చీఫ్‌కు నాలుగు పేజీల లేఖ ఒకటి ఆమె బాధితులు రాసి పంపినట్టు చెప్తున్నారు. పోలీస్ విభాగంలోని మరో ఉన్నతాధికారి కూడా ఆ అధికారి తీరుపై ఏకంగా 30 పేజీల నివేదికను హోం శాఖకు పంపినట్టు చెప్తున్నారు. వీటిని పక్కనబెట్టి ఆ పేరును మెరిట్ జాబితాలో ఉంచేలా రాష్ట్రంలోని షాడో సీఎం పావులు కదిపినట్టు గుసగుసలు. రాష్ట్ర ముఖ్యనేత సామాజిక వర్గానికి చెందిన ఆ అధికారి ఇప్పుడున్న పోస్టును అడ్డం పెట్టుకొని నగర శివారులోని మాన్సాన్పల్లిలో 13 ఎకరాల్లో మరో అధికారితో కలిసి ఏకంగా విల్లా ప్రాజెక్టును చేపట్టారని సమాచారం. తన ఏరియాలో ఏ స్టేషన్లో ఏ సివిల్ వివాదం వచ్చినా ఈ అధికారికి సమాచారం చేరిపోయే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతీ వివాదంలో డబ్బు పిండుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ అధికారికి ఇప్పుడు ఐపీఎస్ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం విడ్డూరమని పోలీసు వర్గాలే చెప్తున్నాయి.
ట్రాక్ రికార్డు లేని వారికి..
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన జాబితాపై కొంతమంది నాన్‌క్యాడర్ ఎస్పీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొంతమంది అనర్హులను, ట్రాక్ రికార్డు సరిగాలేని వారి పేర్లను కూడా కేంద్రానికి సిఫార్సు చేసిందని వారు ఆరోపిస్తున్నారు. ఈసారి పంపిన జాబితాలో అర్హులను పక్కనబెట్టారని, ఏసీబీ కేసులున్న వారికి, ఇంటిగ్రిటీ విషయంలో అనేక ఆరోపణలున్న వారికి కూడా జాబితాలో చోటు కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. రెండు పోస్టులపై ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఒకరిపై ఏసీబీ కేసులుండగా, మరొకరిపై అనేక దందాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సర్వీసులో సస్పెండ్ అయిన వారికి కూడా మెరిట్లో స్థానం కల్పించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.