హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. న్యాయవాదులు గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్ పేర్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ నెల 1,2 తేదీల్లో కొలీజియం సమావేశమై దేశంలోని ఎనిమిది హైకోర్టులకు 36 మంది న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేసింది.
వారిలో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టుకు ఒకరు (తుహిన్‌కుమార్ గేదెల)ను సిఫారసు చేసింది. ఈ పేర్లను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి పంపాల్సి ఉన్నది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాక గెజిట్ ప్రచురణ జరిగాక న్యాయమూర్తులుగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది. గౌస్ మీరా మొహినుద్దీన్: హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన మొహినుద్దీన్ 1969 జూలై 15న జన్మించారు. ఏపీలోని నెల్లూరు వీఆర్ లా కాలేజీలో ఐదేండ్ల లా చదివిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు.
1993 మార్చి 17న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్లో స్టాండింగ్ కౌన్సిల్‌గా చేశారు. సివిల్, రాజ్యాంగపరమైన కేసులు వాదించిన అనుభవం ఉన్నది. తండ్రి మహమ్మద్ ఇస్మాయిల్ హెచ్ఎంటీ మేనేజర్‌గా చేశారు.
సుద్దాల చలపతిరావు: జనగామ జిల్లా కేంద్రంలో సుద్దాల చలపతిరావు 1971 జూన్ 25న జన్మించారు. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాక వైఎస్ రామారావు వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో అనుభం ఉన్నది. జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు.
వాకిటి రామకృష్ణారెడ్డి: వాకిటి రామకృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు మండలంలో 1970 సెప్టెంబర్ 14న జన్మించారు. బీకాం, ఎల్ఎల్బీ చేశాక 1998 ఏప్రిల్ 2న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ అడ్వొకేట్ ఏ అనంతరెడ్డి వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. హైకోర్టు, కింది కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. రాజ్యాంగం, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్ కేసుల్లో అనుభవం ఉన్నది. పలు ప్రైవేటు కంపెనీలు, బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్‌గా చేశారు.
గాడి ప్రవీణ్‌కుమార్: గాడి ప్రవీణ్‌కుమార్ నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 1971 ఆగస్టు 28న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎంఏ, కాకతీయ యూనివర్సిటీలో లా, ఉస్మానియాలో లామాస్టర్స్ చేశారు. 1999లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. హైకోర్టు న్యాయవాది జయప్రకాశ్‌రావు వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, లేబర్ కోర్టులో ప్రాక్టీస్ చేశారు. రాజ్యాంగం, సర్వీస్, కాంట్రాక్ట్, లేబర్, సివిల్, క్రిమినల్ లా కేసులను వాదించిన అనుభవం ఉన్నది. ప్రస్తుతం డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా చేస్తున్నారు. పలు ప్రభుత్వరంగ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా గతంలో పనిచేశారు.