Telangana Weather | హైదరాబాద్/నమస్తే నెట్వర్క్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్ వరకు ఉన్న ద్రోణి తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో మరో 4 రోజులపాటు రాష్ర్టానికి వర్షసూచన ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భధ్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతోకూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. రాబోయే 48 గంటలు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. హైదరాబాద్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భద్రాచలంలో 32.8 మిల్లీ మీటర్లు, దుండిగల్ 5.8, హకీంపేట 34.6, హనుమకొండ 4, హైదరాబాద్ 31.7, ఖమ్మం 17.6, మహబూబ్నగర్ 5.6, మెదక్లో 6, నిజామాబాద్ 1.8, హయత్నగర్ 11.2, పటాన్చెరు 15.4, రాజేంద్రనగర్ 35.0 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.
గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అక్కడక్కడా వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపడి నాలుగు మేకలు మృతి చెందాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 13.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.