రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ పరిధిలోని సర్వేనంబరు 27లో సుమారు 64.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో 27.18 ఎకరాల భూమిపై 80వ దశకం నుంచే న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో 2022లో అప్పటి జిల్లా ఉన్నతాధికారి దానికి ఎన్వోసీ ఇవ్వడం.. దాని ఆధారంగా ఒక నిర్మాణ కంపెనీ అక్కడ సుమారు 59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు టవర్ల నిర్మాణాన్ని చేపట్టింది. వాస్తవానికి అది ప్రభుత్వ భూమి. రెవెన్యూ రికార్డులే కాదు.. ఏకంగా అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అది ప్రభుత్వ భూమి అని ఆధారాలతో సహా హైకోర్టును ఆశ్రయించారు.
ఫిర్యాదా? ఆ ఒక్కటీ అడక్కు!
హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కానీ హైడ్రా అసలు తమకు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయలేదని ప్రకటించింది. దీంతో మరోసారి హైడ్రాకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు సూచించింది. ఇది జరిగి నెలలు గడుస్తున్నది. ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్! సదరు నిర్మాణ సంస్థ యుద్ధపాత్రిపదికన ఏడు టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నది. మరి.. ‘రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కదా? కాపాడరేంది?’ అని ప్రశ్నిస్తే తమకు ఫిర్యాదు అందలేదని హైడ్రా అంటున్నది. హైకోర్టు సూచించినా ఎమ్మెల్యేలు హైడ్రాకు ఫిర్యాదు చేయరు. అంటే ఇక్కడ సామాన్యుడే పిచ్చోడు!! అధికార పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ అది అక్రమ నిర్మాణమని ప్రకటించారు. మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రభుత్వ భూములను కాపాడేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్తున్నది కదా..! మరి.. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఇంకా ఏం ఫిర్యాదులు కావాలి? విషయాన్ని తెర మీదకు తెచ్చిన ఎమ్మెల్యేల మౌనం ఎందుకు? హైడ్రా ఎందుకు ముందుకు కదలడం లేదు? ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, హైడ్రా సమాధానాలు చెప్పకపోవచ్చుగాని ప్రజలు తెర వెనుక ఏం జరిగిందో గుర్తించలేని అమాయకులు కాదు కదా!!
భర్తను కోల్పోయి.. రోడ్డున పడి..

మణికొండ అల్కాపూర్ టౌన్ షిప్‌లోని అనుహార్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్స్.. దాని దిగువన పద్నాలుగు దుకాణాలున్నాయి. అందులో ఒక దానిలో చిన్న కూరగాయల దుకాణం. ఒక కుటుంబం ఆ దుకాణం మీదనే ఆధారపడి పొట్టపోసుకుంటున్నది. అకస్మాత్తుగా కూరగాయల దుకాణం నిర్వహించే వ్యక్తి మరణించారు. దీంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాన్ని పోషించుకోవాల్సి ఉన్నందున భర్త చనిపోయిన నెల రోజులకే ఆయన భార్య దుకాణం నిర్వహణకు వచ్చింది. ఈ సమయంలో ఒక్కసారిగా హైడ్రా బుల్డోజర్ ఆ దుకాణ సముదాయంపై విరుచుకుపడింది.
కూరగాయల దుకాణాన్ని కూడా హైడ్రా కూల్చివేసింది. అసలే భర్త పోయిన దుఃఖంలో ఉన్న ఆమెకు ఇదో పిడుగుపాటు. ఇదెక్కడి అన్యాయమని ఆరా తీస్తే నివాస సముదాయం కోసం అనుమతి తీసుకున్న ఆ అపార్ట్మెంట్లో కూరగాయల దుకాణం వంటి వ్యాపార కేంద్రాలు నిర్వహిస్తున్నారని అపార్ట్‌మెంట్‌వాసులు ఫిర్యాదు చేస్తే హైడ్రా కేవలం వారంలోనే బులోజర్లకు పని చెప్పింది. హైదరాబాద్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా కాలనీల్లో నివాస సముదాయాల కింద దుకాణాలుంటాయి. ఇదే సూత్రాన్ని అమలు చేస్తే కేవలం హైదరాబాద్ నగరంలోనే లక్షలాదిగా కూల్చివేతలు చేపట్టాలి. కానీ హైడ్రా ఇక్కడ మాత్రమే ఆ నిబంధనలను అమలు చేసింది. తన కుటుంబానికి ఇదొక్కటే ఆధారమంటూ ఆ మహిళ కాళ్లావేళ్లా పడ్డా హైడ్రా కనికరించలేదు. అపార్ట్‌మెంట్‌వాసుల సమక్షంలోనే నిబంధనలను అమలు చేశామంటూ గొప్పలు చెప్పుకున్నది.
కండ్లకు ‘ఫెన్సింగ్’ చుట్టొద్దు..!

ఇలా తొలగించి.. అలా ఫెన్సింగ్ వేసి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని రాఘవేంద్రకాలనీలో పార్కుతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రెండు వేల గజాలను లే అవుట్లో చూపించారు.పార్కు స్థలం కబ్జా అయిందంటూ హైడ్రాకు ఫిర్యాదు అందింది.
వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖలతో పరిశీలించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేసి పార్కు స్థలాన్ని కాపాడినట్టు బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడే కాదు.. హైడ్రా ఏర్పడిన తర్వాత అనుమతుల్లేని లేఅవుట్లలో ఇలా పదుల సంఖ్యలో ఆక్రమణలను తొలగించి హైడ్రా స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేసిన దాఖలాలున్నాయి. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం గజాలకు లెక్కగట్టి, రూ.వందల కోట్ల విలువైన భూములను హైడ్రా కాపాడినట్టుగా ప్రకటనలు వచ్చాయి. రికార్డుల్లోనూ ‘రికార్డు’లు నమోదు చేసుకుంటున్నారు. ఇక్కడ విచారణలు, రికార్డుల పరిశీలనలూ ఏవీ ఉండవు. కేవలం కాలనీవాసుల ఫిర్యాదులు మాత్రమే ఆధారం. హైడ్రా కదా? అడిగేవారుండరు. ఫెన్సింగ్‌ను అడ్డుకునే వారు అసలే ఉండరు.
హైడ్రా అయితే నాకేంటి! అన్నా స్పందించరు

గాజులరామారంలో సర్వేనంబర్ 307తోపాటు దానిని ఆనుకుని ఉన్న సర్వేనంబర్లలో 444 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. భారీస్థాయిలో ఆక్రమణకు గురైనట్టు హైడ్రాకు ఫిర్యాదు అందింది. పెత్రమాస పూట పోచమ్మబస్తీ, బాలయ్యబస్తీతో పాటు తెలంగాణ అంతా పండుగలో నిమగ్నమైంది. కానీ హైడ్రా బుల్డోజర్లు మాత్రం ఆ బస్తీల వైపు దూసుకొచ్చాయి. ఎడాపెడా ఏకంగా 260 ఇండ్లను నేలమట్టం చేశాయి.
పండుగ రోజు సామాన్లు తీసుకునేందుకైనా సమయం ఇవ్వండని నిరుపేదలు నెత్తీ నోరు కొట్టుకున్నా హైడ్రా కనికరించలేదు. 12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆక్రమణల్ని కూడా తొలగించారు. భూమి స్వాధీనంలో భాగంగా ఫెన్సింగ్ పనులు మొదలుపెట్టారు. సాయంత్రం వరకు 600 మీటర్ల ఫెన్సింగ్ పూర్తి చేశారు. రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడామంటూ హైడ్రా ప్రకటనలు గుప్పించింది. మరుసటి రోజు మిగిలిన ఫెన్సింగ్ పనుల్ని చేపట్టాలి. కానీ 24 గంటలు గడవకముందే ఎమ్మెల్యే గాంధీ అనుచరులు వచ్చి హైడ్రా వేసిన ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశారు. మళ్లీ ఫెన్సింగ్ వేసుకొని భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇండ్లు కూల్చిన వైపు నేటికీ ఏ ఒక్కరినీ హైడ్రా అనుమతించడం లేదు. అనేక సందర్భాల్లో హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా కూల్చివేతలు చేపట్టిన హైడ్రా… ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే ఆక్రమణల వైపు కన్నెత్తి చూడటం లేదు.
పెద్దోళ్లకు సలామ్!

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కొత్వాల్‌గూడ పరిధిలోని 32 ఎకరాల ప్రభుత్వభూమి. దీనిని బడాబాబులు ఆక్రమించారు. డాక్యుమెంట్లు చూపి న్యాయస్థానాలను ఆశ్రయించారు. కోర్టులో కేసు ఉండగానే కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగి భూములు చేతులు మారాయి. ఫంక్షన్‌హాళ్లు, ఇతరత్రా నిర్మాణాలు వెలిశాయి.
ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ భూమి ప్రభుత్వానిదేనని తీర్పు ఇచ్చింది. కేసు గెలిచాం.. భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోండంటూ న్యాయవాది రెవెన్యూ అధికారులకు లేఖ కూడా రాశారు. ఆ తర్వాత కోర్టు తీర్పుకాపీ అధికారులకు చేరింది. అయినా ఆ భూమి వంక అధికారులు కన్నెత్తిచూడలేదు. అంతేకాదు.. ఈ వ్యవహారం హైడ్రాకు చేరినా అసలు ఆ వైపే దృష్టి పెట్టలేదు. అక్కడున్న ఆనంద్ కన్వెన్షన్ విషయంలో పలువురు హైడ్రాను ఆశ్రయించినా ఎలాంటి ఫలితం లేదు. ఎందుకంటే ఇది పెద్దోళ్ల భూమి కాబట్టి!
పేదల ఇండ్లు ఢమాల్

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వట్టినాగులపల్లి 132 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూమిలో దశాబ్దాల క్రితం నిరుపేదలకు 60 చదరపు గజాల మేర పట్టాలిచ్చారు. అదిపోను మిగిలిన భూమిపై రాజకీయ నాయకులు కన్నేశారు.
ఎంతోకొంత ఇస్తే ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు సహకరిస్తామని చెప్పడంతో సొంతనీడ దొరకుతుందని భావించిన ఓ మహిళ కూలీకి వెళ్లిన డబ్బుతో పాటు బంగారం అమ్మి స్థలం కొని అక్కడ చిన్న గది నిర్మించుకుని ఉంటున్నది. రాజకీయనాయకులు అమ్మినప్పుడు గానీ, ఆమె గది కట్టుకునేటప్పుడు గానీ.. అధికారులెవరూ అటువైపు రాలేదు. ఆ తర్వాత ప్రభుత్వభూముల ఆక్రమణలంటూ ఒక్కసారిగా అధికారులు వచ్చారు. ఆమె వేసుకున్న రేకుల షెడ్డును కూల్చేసి వెళ్లిపోయారు.
రెవెన్యూ రిపోర్ట్ లేదని !

గుడిమల్కాపూర్‌లోని టీఎస్6/1,16,27,28లో ఉన్న నాలా ప్రస్తుతం మనుగడలో లేదు. గతంలో ఉన్న బావి నాలా క్రమక్రమంగా మనుగడ కోల్పోగా దానికి కొంచెం ముందు డ్రైనేజీ నాలా నిర్మించారు. ఇదంతా 30 ఏండ్ల క్రితం జరిగింది.
అయితే నాలాను ఆక్రమించి మహావీర్ అనే నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టిందని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. హైడ్రా ప్రతినిధులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ నిర్మాణాలు ఆక్రమణలేనని తేల్చారు. ఆ తర్వాత అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తీసుకున్నారు. పదినెలలు గడిచినా ఎలాంటి చర్యలూ లేవు. పాత అధికారులు మారారు. ప్రస్తుతం హైడ్రాఅధికారులను అడిగితే రెవెన్యూ రిపోర్ట్ రావాలని దానిని బట్టి తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రెవెన్యూ రిపోర్ట్ ఇచ్చినా..

రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్ బాలాపూర్ గ్రామంలో సర్వేనంబర్ 74లో ఆక్రమణలు జరిగాయంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు.
సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి అనే వ్యక్తి 3.06 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ గత సంవత్సరం డిసెంబర్లో ఫిర్యాదు చేయగా హైడ్రా అధికారులు దీనిపై నివేదిక కావాలంటూ బాలాపూర్ తహసీల్దార్‌ను కోరారు. జనవరి 6న బాలాపూర్ తహసీల్దార్ స్పష్టంగా ఈ భూమిని సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి, సింగిరెడ్డి దయాకర్‌రెడ్డి, సుచిత్రారెడ్డి ఆక్రమించుకున్నారని, అక్కడ షెడ్లు వేసుకున్నారని హైడ్రా కమిషనర్‌కు లేఖ రాశారు. ఇవి పూర్తిగా ఆక్రమణలని, వీటిని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి తొలగించాలని అందులో సూచించారు. ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తూ రెవెన్యూ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా హైడ్రా అక్కడ ఆక్రమణలు తొలగించలేదు.