మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 01:38:24

కొంపముంచిన గుప్తనిధి?

కొంపముంచిన గుప్తనిధి?

వనపర్తి, నమస్తే తెలంగాణ: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో శుక్రవారం కలకలంరేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. రేవల్లి మండలం నాగపూర్‌కు చెందిన ఆర్‌ఎంపీ రహీం, హాజీరాబీ దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు. అందరికీ పెండ్లిళ్లు అయ్యాయి. కుమారుడు కరీంపాషా నాగర్‌కర్నూల్‌లో ఉంటున్నాడు. రెండో కుమార్తె ఆష్మాబేగం కూడా తన భర్త ఖాజా, కూతురు ఆశ్రీన్‌తో కలిసి కొంతకాలంగా నాగర్‌కర్నూల్‌లో జీవిస్తున్నారు. తమ ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని హాజీరాబీ కొన్నేండ్లుగా కుటుంబసభ్యులతో చర్చిస్తుండేది. ఈ క్రమంలో 2014 ఆగస్టు 12న ఇంటి ఆవరణలో తవ్వకాలు జరుపగా ఎలాంటి నిధులు లభించలేదు. తాజాగా అల్లుడు ఖాజా తన భార్యాపిల్లలతో కలిసి నాగపూర్‌కు చేరుకొని గురువారం రాత్రి హజీరాబీ ఇంట్లో తవ్వకాలు జరిపినట్లు  ఆనవాళ్లు ఉన్నాయి.  గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఇంట్లోనే నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పదస్థితిలో చనిపోయారు. ఖాజా మృతదేహం ఇంటి వెనకభాగంలో తవ్వకాలు జరిపిన ప్రదేశంలో పడిఉన్నది. ఇంట్లో మృతదేహాలను గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వనపర్తి ఎస్పీ అపూర్వరావు గ్రామానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయినవారిని హాజీరాబీ(60), ఆష్మాబేగం (35), ఖాజా (42), ఆశ్రీన్‌ (7)లుగా గుర్తించినట్లు చెప్పారు. ఇంటి ఆవరణలో గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు నిర్వహించినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయనీ, విచారణ పూర్తిచేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇదిలావుండగా ‘మా ఇంట్లో గుప్తనిధులు, దెయ్యాలు ఉన్నాయని.. నిధులను బయటకు తీయాలని మా అమ్మ హాజీరాబీ తరచూ చెబుతూ ఉండేది’ అని మృతురాలి కొడుకు కరీంపాషా తెలిపాడు. గతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన సమయంలో తన తండ్రి రహీం మృతిచెందినట్లు పేర్కొన్నాడు.


logo