హుజూర్నగర్ , ఏప్రిల్ 30 : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శివారులో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.75వేల విలువైన 1.5 కిలోల గంజాయి, బైక్ , నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చరమందరాజు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం .. ఎస్సై బండి మోహన్ తన సిబ్బందితో కలిసి హుజూర్నగర్ పట్టణ శివారులో గురువారం నిఘా పెట్టారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, గంజాయి విక్రయానికి పాల్పడుతున్నట్టు తేలింది.
అరెస్ట్ అయిన వారిలో షేక్ సుభానీ, చౌడం యశ్వంత్ , ములకలపల్లి నాగమణికంఠ, షేక్ అబ్దుల్ అజీజ్ ఉన్నారు. ప్రధాన నిందితుడైన షేక్ సుభానీ ఏపీలోని సీలేరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన సాయి నుంచి రూ.8వేలకు గంజాయి కొనుగోలు చేసి హుజూర్నగర్లో స్నేహితుడైన యశ్వంత్ సాయంతో అధిక ధరకు విక్రయిస్తున్నట్టు ప్రాధమిక విచారణలో తేలిందని, నిందితులపై కేసు నమోదుచేసి కోర్టుకు తరలించినట్టు సీఐ తెలిపారు.