మణికొండ, జూన్ 25: రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవంతోపాటు అన్ని వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ ఆత్మగౌరవ భవనానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో దేశంలో ఎక్కడా లేని విధంగా వెనుకబడిన వర్గాలకు సంక్షేమ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అన్ని కులాలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే విలువైన కోకాపేట ప్రాంతంలో భవనాలను నిర్మించుకునేందుకు ఐదు ఎకరాల స్థలంతోపాటు రూ.5 కోట్ల నిధులు కేటాయించినట్టు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ కక్షలతో కల్లు దుకాణాలను మూసివేయించి, గీత కార్మికులకు ఉపాధిని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని తిరిగి తెరిపించి ఉపాధి కల్పిస్తున్నదని చెప్పారు. కల్లు దుకాణాలను తెరిపించడంతోపాటు వైన్స్ టెండర్లలో గౌడ్లకు 15 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నీరా పాలసీని తీసుకొచ్చామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.30 కోట్ల ఈత, తాటి చెట్లను నాటినట్టు వెల్లడించారు. కల్లు అమృతం వంటిదని, దీనిని కుటీర పరిశ్రమగా ఆదరిస్తున్నామని చెప్పారు. గౌడ కులస్థులు సొసైటీల్లో కొత్త సభ్యత్వాలను నమోదు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో తాడిబార్లుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. గతంలో గీత కార్మికుల సొసైటీ తరపున ప్రభుత్వానికి ఏటా రూ.16 కోట్ల చొప్పున చెట్ల పన్ను చెల్లించేవారని, దానిని కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. గీత కార్మికుల కుటుంబాలకు ఈ సందర్భంగా రూ.12.50 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు.
సుభిక్షంగా అన్ని వర్గాల ప్రజలు
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కీర్తించారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే బీఆర్ఎస్ సర్కారుకు ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈత చెట్లకు నంబర్లు కేటాయించి, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుబంధు మాదిరిగా గౌడబంధు అమలు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. త్వరలో ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, తెలంగాణ గీత కార్మిక సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, స్పోర్ట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్, జడ్పీ చైర్పర్సన్ వనజా ఆంజనేయులుగౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, సత్యనారాయణగౌడ్, రాజేశంగౌడ్, గౌడసంఘాల ప్రతినిధులు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, బాలరాజుగౌడ్, చింతల మల్లేశంగౌడ్, బీ ప్రభాకర్‌గౌడ్, అయిలి వెంకన్నగౌడ్, ఎలికట్టే విజయ్‌కుమార్‌గౌడ్, వట్టికూటి రామారావుగౌడ్, అంబాల నారాయణగౌడ్, జేఎస్ఆర్ సన్‌సిటీ నారాయణగౌడ్, కూరెళ్ల వేములయ్య, ప్రశాంత్‌గౌడ్, అశోక్‌గౌడ్, ప్రతాప్‌లింగంగౌడ్, అమరవేని నర్సాగౌడ్, శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.