హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : ఐఐటీ, నీట్ తదితర ప్రవేశ పరీక్షలకు ఫౌండేషన్ కోర్సును ఈ ఏడాది నుంచి మరో 10 ఎస్సీ గురుకులాల్లో ప్రవేశపెట్టనున్నారు. గౌలిదొడ్డి, కరీంనగర్ సీఈవో(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్) తరహాలోనే 10 గురుకులాలను తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు సొసైటీ సెక్రటరీ వర్షిణి బుధవారం వెల్లడించారు. ఈ గురుకులాల్లో 8వ తరగతి నుంచే ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. ఎస్సీ గురుకులాల్లో చదివే వారికే రాతపరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు.
సొసైటీ పరిధిలోని ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు వర్షిణి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్లో ప్రవేశాలను టెన్త్ మార్కుల ఆధారంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థులు ముందస్తుగానే కుల, ఆదాయ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు.