హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : హామీల అమలుపై పట్టుబడుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే రేవంత్ సర్కారు తప్పుడు కేసులు బనాయిస్తున్నదని, పాలన చేతగాకే కక్ష సాధింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకే ఫార్ములా-ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటే అనవసర రాద్ధాంతం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. ఫార్ములా- ఈ రేస్‌పై జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంట్లో బహిరంగ విచారణకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని సవాల్ చేశారు. రైతు భరోసా కుదింపు నుంచి దృష్టి మళ్లించేందుకే రేవంత్‌రెడ్డి డైవర్షన్ డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు.. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ములా-ఈ ఒప్పందంలో ప్రభుత్వపరంగా తీసుకున్న నిర్ణయానికి కేటీఆర్‌పై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు రాష్ట్రంలో యథేచ్ఛగా పౌరహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నదని, చట్టబద్ధ సంస్థలను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నదని దుయ్యబట్టారు. విచారణ సంస్థలు సైతం రేవంత్ ఆడే రాజకీయ క్రీడలో పావులుగా మారడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
పోలీసులు కూడా సర్కారు ఇచ్చే తాయిలాలకు ఆశపడకుండా చట్టపరిధిలో వ్యవహరించాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఏసీబీ అమితమైన రాజభక్తిని ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. ‘హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉన్న కేసులో కేటీఆర్‌ను విచారణకు పిలువడంలో అంతర్యమేంటి? న్యాయవాదులను అనుమంతిచకపోవడంలోని ఔచిత్యమేంటి? రాజ్యాం గం కల్పించిన హక్కు మేరకే కేటీఆర్ న్యాయవాదులను తీసుకెళ్తే అభ్యంతరమేంటి?’ అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. పట్నం నరేందర్‌రెడ్డి విషయంలోనూ ఇలాగే వ్యవహరించి తప్పుడు స్టేట్మెంట్లు నమోదు చేయించారని ఆరోపించారు. కేటీఆర్ విషయంలోనూ అదేతీరులో వ్యవహరించేందుకే లాయర్లను నిరాకరిస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కేటీఆర్ తన న్యాయవాది ద్వారా స్టేట్మెంట్ అందించారని చెప్పారు. ఇప్పటికైనా సర్కారు తప్పుడు కేసులు బనాయించడం మాని రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. సమావేశంలో మాజీ మంత్రులు సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.