Jayalalitha | హైదరాబాద్, జూలై 29 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్రప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉన్నదా? లేక, రాజకీయ ప్రయోజనాల కోసం కోటా పేరిట ఆటలాడుతూ బీసీలను మోసం చేస్తున్నదా?? రిజర్వేషన్లను సాధించడానికి ఢిల్లీలో ధర్నా చేస్తామని క్యాబినెట్లో నిర్ణయించడం, ఆ మరుసటిరోజే ఏవో కారణాలతో ధర్నాను వాయిదా వేయడాన్ని చూస్తే ఇదంతా నిజమేననిపిస్తున్నది. బీసీల ప్రయోజనాలకు నిజంగా రేవంత్ ప్రభుత్వం కట్టుబడినట్లయితే, తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మాదిరిగానే కేంద్రంతో కొట్లాడి బీసీలకు అండగా నిలిచేవారని బీసీ నేతలు, నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ మేరకు 90వ దశకంలో జరిగిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో కేవలం తమిళనాడులో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీనికి కారణం ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితేనని చెప్పొచ్చు. 90వ దశకానికి ముందు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను గత డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌ల రూపంలో తీసుకొచ్చినప్పటికీ, న్యాయస్థానాల్లో అవి నిలువలేకపోయాయి. ఈ క్రమంలో బడుగులకు (బీసీ, ఎస్సీ, ఎస్టీ) 69 శాతం రిజర్వేషన్లను తీసుకువస్తున్నట్టు 1991లో అప్పటి జయలలిత ప్రభుత్వం కూడా ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం.. విద్య, ఉపాధి అవకాశాల్లో బీసీలకు 26.5 శాతం, అత్యంత వెనుకబడిన బీసీలకు 20 శాతం, ముస్లిం బీసీలకు 3.5 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు ఒక శాతం రిజర్వేషన్‌ను తెచ్చారు. అయితే, రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఈ ఆర్డినెన్స్‌ను మద్రాస్ హైకోర్టు పలుమార్లు కొట్టివేసింది.
బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తున్న ఈ చట్టాన్ని న్యాయస్థానాల్లో ఎవరూ సవాల్ చేయకుండా ఉండాలంటే దాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడమే మార్గమని జయలలిత భావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 31బీ ప్రకారం.. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టాన్ని లేదా ప్రొవిజన్లను ఏ న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీలుండదు. ఇది తెలిసిన జయలలిత ఢిల్లీలోనే ఉండి కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. బడుగులకు 69 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్న తమిళనాడు చట్టం 1994ను 9వ షెడ్యూల్లో చేర్చేలా పట్టుబట్టారు. జయలలిత ఒత్తిళ్లకు తలొగ్గిన అప్పటి కేంద్రం.. ఆగస్టులో తమిళనాడు చట్టం 1994ను 9వ షెడ్యూల్లో చేర్చింది. ఈ మేరకు అవసరమైన రాజ్యాంగ సవరణలను కూడా చేసింది. అలా.. దశాబ్దాల పాటు మాజీ సీఎంలు కరుణానిధి, ఎంజీఆర్‌లకు సాధ్యంకాని ఫీట్‌ను కేవలం మూడు నెలల్లోనే జయలలిత సాధించారు. బీసీ రిజర్వేషన్ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాకే ఆమె తిరిగి తమిళనాడులో అడుగుపెట్టడం గమనార్హం. అందుకే జయలలితను సమూగ నీతి కథా వీరాంగనై (సామాజిక న్యాయాన్ని నిలబెట్టిన నాయిక)గా తమిళ బీసీలు ఇప్పటికీ కీర్తిస్తారు.
బీసీ రిజర్వేషన్లకు చట్టపరంగా సమస్యలు తొలగాలంటే ఢిల్లీలోనే తేల్చుకోవాలని జయలలిత నిర్ణయించారు. 1993 నవంబర్‌లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన తమిళనాడు బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బిల్లును రాష్ట్రపతితో ఆమోదింపజేయడానికి తన పరీవారంతో కలిసి 1994 జూన్‌లో హస్తినకు ఆమె బయల్దేరారు. ఏ పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్లను తీసుకురావాల్సి వచ్చిందన్న విషయాన్ని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు ఆమె క్షుణ్ణంగా వివరించారు. బీసీల అభ్యున్నతికి రిజర్వేషన్లు అవసరమని తేల్చి చెప్పారు. జయలలిత వాదనతో పీవీ ఏకీభవించారు. ఆయన సూచన మేరకు.. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ తమిళనాడు బీసీ రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేశారు.
రాష్ర్టాలు చేసే కులగణన చెల్లుబాటు కాదని కేంద్రం ఎప్పుడో చెప్పింది. చెల్లబాటు కాని కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని రేవంత్ ప్రభుత్వం చెప్పడం.. రిజర్వేషన్లను పూర్తిగా ఎగ్గొట్టే కుట్రగా బీసీ నేతలు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, కోర్టుల్లో నిలబడని ఆర్డినెన్సులతో కాలయాపన చేయడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీలో ధర్నా చేస్తామని సోమవారం క్యాబినెట్ భేటీలో నిర్ణయించి.. ఆ మరుసటి రోజే దాన్ని వాయిదా వేయడాన్ని చూస్తే.. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడంలేదని బీసీ నేతలు, నెటిజన్లు విమర్శిస్తున్నారు.