హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఆర్బిట్రేషన్-మీడియేషన్ విధానానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, త్వరలో నే పార్లమెంట్ మీడియేషన్ బిల్లు-2021ను ఆమోదించనున్నదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్(ఐఏఎంసీ) ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భం గా జాతీయ మధ్యవర్తిత్వ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను రాజీ చేసుకునే విధానాన్ని అనుసరిస్తేనే ఏ దేశమైనా న్యాయ వివాదాల సత్వర పరిషారం ద్వారా పురోగతిని సాధిస్తుందని వివరించారు. ఈ అంశంపై కేంద్ర పార్లమెంటరీ కమిటీ లోతుగా అధ్యయనం చేస్తున్నదని తెలిపారు.
దేశాభివృద్ధి, సమాజాభివృద్ధికి మధ్యవర్తిత్వం ఎంతగానో దోహదపడుతుందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఓర్పు, సహ నం, సమయస్ఫూర్తి ఉంటే మధ్యవర్తిత్వం ద్వారా కేసులను రాజీ చేయడం సులభమని పేర్కొన్నారు. ఈ విధానం దేశ ఆచార, వ్యవహార, సంప్రదాయాల్లో మమేకమై ఉన్నదని గుర్తు చేశారు. మహాభారత యుద్ధం జరగరాదని భావించిన శ్రీకృష్ణు డు.. కౌరవ-పాండవుల మధ్య రాయబారానికి ప్ర యత్నించాడని, కృష్ణుడి మధ్యవర్తిత్వం విఫలమైన తర్వాతే మహాభారత యుద్ధం జరిగిందని వివరించారు. హైదరాబాద్లోని ఐఏఎంసీ ఏర్పాటుకు అవసరమైన భవనం, భూమి, నిధులు సమకూర్చి ప్రో త్సహిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు జస్టిస్ ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలియజేశారు.
చోళుల మధ్యవర్తిత్వం: జస్టిస్ హిమాకోహ్లీ
దక్షిణ భారతదేశ పాలనపై చెరగని ముద్ర వేసిన (9-13 శతాబ్ధాలు) చోళుల కాలంలోనే మధ్యవర్తిత్వం-రాజీ విధానాలు సమర్ధంగా అమలు జరిగాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ పేర్కొన్నారు. ఏఐఎంసీ ఇప్పటివరకు 33 కేసులను (10 ఆర్బిట్రేషన్, 23 మీడియేషన్) పరిషరించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు తెలిపారు. దీంతో మొత్తం 700 బిలియన్ డాలర్ల విలువైన వివాదాలు పరిషారమయ్యాయని వివరించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి, ఐఏఎంసీ సీఈవో జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, సింగపూర్ ఐఏఎంసీ చైర్మన్ జార్జిలిమ్ ప్రసంగించారు. తారిక్ స్వాగతం చెప్పారు.