చందూర్, మార్చి 7: పంటలను ఎట్టిపరిస్థితుల్లో ఎండనివ్వబోమని, రైతన్నలకు అండగా ఉంటామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సాగునీరందించి పంటలను కాపాడుతామని హామీ ఇచ్చారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం మేడ్పల్లి పర్యటించారు. రైతులు సాగుచేస్తున్న పంటలతోపాటు, కాలువ పూడికతీత పనులను పరిశీలించారు.
ఇటీవల పంటలకు చెరువుల నుంచి అందిస్తున్న కాలువల్లో మట్టిపేరుకుపోవడాన్ని సర్పంచ్ ద్వారా తెలుసుకున్న పోచారం తన సొంత ఖర్చు రూ. 2 లక్షలతో కాలువ పూడికతీత పనులను చేపట్టారు. ఈ మేరకు గ్రామంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటలకు నీరు అందించే కాలువలో గడ్డి, మట్టి పేరుకుపోయి నీటి ప్రవాహం తగ్గిందని తెలిపారు. మరమ్మతుల కోసం రూ. 2 లక్షలు అవసరమవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. నిధుల విడుదల ఆలస్యమవుతున్న నేపథ్యంలో పంటలు ఎండకుండా ఉండాలనే ఉద్దేశంతో తన సొంతఖర్చుతో మరమ్మతులు చేపట్టినట్టు వివరించారు.