ఎల్లారెడ్డి, ఏప్రిల్ 13: ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. తప్పు చేసిన వారిని శిక్షించే సమయం వచ్చిందని, హామీలతో మోసగించిన రెండు జాతీయ పార్టీలకు గుణపాఠం చెప్పాలని సూచించారు. శనివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పోచారం మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, మూడు నెలల పాలనలో దాని నిజస్వరూపం ప్రజలకు తెలిసిందని అన్నారు. ప్రధాని మోదీ రైతులను మోసం చేశారని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి పదేండ్లు అయినా చేసిందేమీ లేదని విమర్శించారు. పదేండ్లు ఎంపీగా ఉండి ఏమీ చేయలేని బీబీ పాటిల్‌కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. కాంట్రాక్టుల కోసమే పాటిల్ పార్టీ మారినట్టు చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు.