బాన్సువాడ, జూలై 26: కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని స్థానిక ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 11 వేల ఇండ్లను మంజూరు చేయించినట్టు చెప్పారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజుతో కలిసి శుక్రవారం బాన్సువాడలోని తన నివాసంలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు పోచారం చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. పార్టీ మారినప్పటికీ మేలు చేసిన వారిని మరువొద్దన్న పోచారం.. కేసీఆర్ హయాంలో నియోజకవర్గంలో రూ.550 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటరీ ల మరమ్మతులకు రూ.150 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు రూ.150 కోట్లు, చందూర్ లిఫ్ట్‌కు రూ.160 కోట్లు , సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు రూ.200 కోట్లతో చేపట్టినట్టు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలనే ఆలోచనతోనే పార్టీ మారినట్టు చెప్పారు.
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వీలైనంత వేగంగా పరిషరించాలని అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ తీసుకోవాలని తెలిపారు. ‘లే అవుట్ రెగ్యులైజేషన్ సీమ్’ (ఎల్ఆర్ఎస్) అమలుపై శుక్రవారం సచివాలయంలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇందుకోసం 33 జిల్లాల్లో ప్రత్యేకంగా బృందాలను రూపొందించుకోవాలని సూచించారు.