సంగారెడ్డి జనవరి 29(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రతిఘటన తప్పదని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మధుసూదనాచారి హెచ్చరించారు. సీఎం హోదాకు తగ్గట్టుగా రేవంత్‌రెడ్డి వ్యవహరించడం లేదని, ఆయన తీరును ప్రజలు సహించడం లేదని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో సోమవారం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సమావేశానికి మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని, ఆయన తన తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విచారణల పేరుతో కొండను తవ్వి ఎలుకలను పట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని విచారణలకైనా తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు.
కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఏనాడూ కరెంటు కోతలు, సాగునీటి ఇబ్బందులు లేవని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యంతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎన్నడూ తెలంగాణ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తలేదని విమర్శించారు. ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అందోల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుకోసం పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం, తప్పుడు హామీల కారణంగా అందోల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చంటి క్రాంతికిరణ్ పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిందని, దీనిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జైపాల్‌రెడ్డి, మఠం భిక్షపతి, బాలయ్య, రాహుల్‌కిరణ్, ఉదయ్బాబూమోహన్, జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.