కరీంనగర్ కలెక్టరేట్, జూలై 8: ‘అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసినం. వడ్డీలు తడిసి మోపెడయినయ్. మా ఆస్తులు అమ్మి కట్టినం. అయినా మాకు ప్రభుత్వం బిల్లులివ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తంచేస్తూ కరీంనగర్ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఓ మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది. కలెక్టర్ పమేలా సత్పతి ఎదుటే తువాలతో గొంతు బిగించుకోవడంతో ఆమె ఒక్కసారిగా హతాశయురాలయ్యారు. పోలీసులు అడ్డుకొని అతడిని బయటకు లాక్కెళారు. రామడుగు మాజీ సర్పంచ్ పంజాల ప్రమీల భర్త జగన్‌గౌడ్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టగా, రూ.65 లక్షలు బిల్లులు రావాల్సి ఉన్నది. బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగిన జగన్‌గౌడ్, ప్రజావాణిలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆయనతోపాటు వచ్చిన రామడుగు, గంగాధర మండలాల మాజీ సర్పంచులు సైతం ఆందోళనకు దిగగా పోలీసులు సముదాయించి పంపారు.