హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందర హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక మొండిచేయి చూపుతున్నది. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పు డూ.. అప్పుడంటూ మభ్యపెడుతున్నది. గతంలో సర్పంచులు చేసిన పనులకు సంబంధించి కలెక్టర్ల ద్వారా నివేదిక తెప్పించుకొని రూ.588 కోట్లు పెండింగ్లో ఉన్నట్టు లెక్కతేల్చింది.
వీటితోపాటు కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీల్లో చేపట్టిన వివిధ పనులకు మరో రూ.1200 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. పెండింగ్ బిల్లులు ఈ డిసెంబర్ నెలాఖారులోగా చెల్లించాలని రాష్ట్ర సర్పంచుల జేఏసీ డిమాండ్ చేసింది. ఫిబ్రవరిలోగా కొంతమేర చెల్లిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మార్చిలోగా చెల్లిస్తామని బీసీ సంక్షేమ, రెవెన్యూ శాఖ మంత్రి పొన్నం ఇటీవల హామీ ఇచ్చారు.
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు రూ.750 కోట్లు చెల్లించేశామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాలపై సమీక్ష సందర్భంగా చెప్పడం గందరగోళానికి దారితీసింది. సీఎం ప్రకటన పూర్తి అబద్ధమని మాజీ సర్పంచులు ఆక్షేపించారు. ప్రభుత్వం చేసిన చెల్లింపులు.. గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు పంచాయతీ సిబ్బంది వేతనాలు, వీధిలైట్ల నిర్వహణ, ఉపాధిహామీ కింద చేపట్టిన పనులకు సంబంధించినవే తప్ప మాజీ సర్పంచులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. ఎస్డీఎఫ్, ఎస్ఎఫ్సీ నిధులు కూడా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం స్థాయిలో ఉండి అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వెంటనే మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్పంచుల బిల్లులు చెల్లించామని సీఎం అబద్ధాలు చెప్పడాన్ని నిరసిస్తూ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ మేరకు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సచివాలయం వద్దనున్న మహా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతామని తెలిపారు. రాష్ట్రంలోని సర్పంచులందరూ పాల్గొనాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం బేషజాలకు పోకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.