హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్‌పేట్: పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని మాజీ సర్పంచుల జేఏసీ డిమాండ్ చేసింది. బిల్లులు చెల్లించకుండా మాజీ సర్పంచుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 27న గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేయనున్నట్టు వెల్లడించింది. నిరసనకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం సికింద్రాబాద్ గాంధీ దవాఖాన వద్ద జేఏసీ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులను చెల్లించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు తమ సమస్యలను ప్రస్తావిస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య నిర్మాణం కోసం తాము కష్టపడి పనిచేశామని, అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేశామని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందిపెడుతున్నదని పేర్కాన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచుల జేఏసీ ఉపాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగయ్య, గణేశ్, మల్లయ్య, పూర్ణచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.