హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రజాభవన్ ఎదుట మాజీ సర్పంచ్లు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అంగీలు విప్పి ప్రజాభవన్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని నినదించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి బొల్లారం పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. పెండింగ్ బిల్లుల కోసం నిరసన చేపట్టడం తప్పా? అని ప్రశ్నించారు.