కరీంనగర్ విద్యానగర్, ఏప్రిల్ 19: కాంగ్రెస్ నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఇందుకు హుస్నాబాద్‌లో పిచ్చాసుపత్రిని ఏర్పాటు చేయించాలని ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు తాజా, మాజీ సర్పంచ్‌లు కరీంనగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత నుంచి హుస్నాబాద్ అసెంబ్లీ, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఘర్షణ వాతవరణాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ పిచ్చి పిచ్చి చేష్టలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ‘వెధవ, ముండకొడుకా’ అంటూ రాయలేని భాషలో బూతులు తిడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలు సైతం పొన్నం వద్దకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. ఆయన తీరు చూస్తుంటే మతిస్థిమితం కోల్పోయినట్టు ఉన్నదని తెలిపారు. ఆయన మెప్పు పొందేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు ఇదే తీరులో వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారికి మానసిక చికిత్స అవసరమని భావిస్తున్నామని సర్పంచ్‌లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.