నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 27 (నమస్తే తెలంగాణ): గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. బిల్లులు అందక మాజీ సర్పంచ్లు పడుతున్న కష్టాలపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమైనట్టు తెలిపారు.
శుక్రవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు అందక వారు పడుతున్న బాధలు వర్ణణాతీతమని చెప్పా రు. బిల్లుల మంజూరుపై సీఎం రేవంత్రెడ్డి దృష్టిసారించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడాదిన్నరగా పెండింగ్ బిల్లుల సాధన కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. 12వేల మంది మాజీ సర్పంచ్లు న్యా యపోరాటంలో కదలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ సర్పంచ్ల పోరాటానికి అండగా నిలుస్తామని బీఆర్ఎస్ లీగల్ సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు.