హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం వెచ్చించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులకు రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉన్నది. ముఖ్యంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ), కేంద్ర ప్రభుత్వ నిధులు (సీఎఫ్‌సీ), నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్), ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్), వెనుకబడిన ప్రాంత అభివృద్ధి నిధులు (బీఆర్జీఎఫ్), జీఎస్టీ, వోచర్లు, ఇతర మార్గాల ద్వారా సర్పంచులకు, కార్యదర్శులకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉన్నది.
సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత 2024 ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. గత 19 నెలలుగా వివిధ కార్యక్రమాల కోసం తాము జేబులో నుంచి పెట్టిన ఖర్చుల బిల్లులు కూడా మంజూరు చేయాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో గ్రామ కార్యదర్శి సుమారు రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు వెచ్చించారు. సగటున ఒక్కో కార్యదర్శి రూ.3 లక్షలు వెచ్చించినట్టు అంచనా వేసినా 12,769 గ్రామాలకు ఇలా మొత్తం రూ.383 కోట్లు కార్యదర్శులకు రావాల్సి ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మాజీ సర్పంచులు, కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు.
గత ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రామాల్లో పాలకవర్గాలు లేని కారణంగా 2024-25లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,514 కోట్లు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిధులు విడుదల చేయడం లేదు. ఫలితంగా తాగునీటి బోర్లు నిర్వహణ, వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు, చెత్తను సేకరించే ట్రాక్టర్లలో డీజిల్, పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన పరికరాల కొనుగోలు వంటి అంశాల కోసం కార్యదర్శులు సొంత జేబుల్లో నుంచి డబ్బులు వెచ్చించారు. పెద్ద గ్రామ పంచాయతీలకు ఇంటిపన్నులు, వ్యాపార పన్నులు, తైబజార్, భవన నిర్మాణ ఫీజులు, వ్యాపార, వాణిజ్య లైసెన్సు ఫీజుల ద్వారా కొంత మేరకు నిధులు సమకూరుతాయి.
కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు తప్ప ఆర్థికంగా ఆదాయం వచ్చే ఇతర మార్గాలు ఉండవు. ఈ నేపథ్యంలో గ్రామాల కార్యదర్శులు పంచాయతీల నిర్వహణకు జేబుల్లో నుంచి డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి, కొన్ని చోట్ల అప్పులతో పనులు చక్కబెట్టాల్సి వచ్చింది. చిన్న గ్రామాల కార్యదర్శులు ఒక్కో గ్రామంలో గడిచిన 19 నెలల్లో కనీసం రూ.2 లక్షల వరకు వెచ్చించినట్టు తెలుస్తున్నది. అలాగే పెద్ద గ్రామాల పంచాయతీ కార్యదర్శులు రూ.5 నుంచి 7 లక్షలు వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇలా కార్యదర్శులకు రేవంత్‌రెడ్డి సర్కారు రూ.383 కోట్లు బాకీ పడింది. స్థానిక ఎన్నికల ముందే ఈ బిల్లులను క్లియర్ చేయాలని కార్యదర్శులు కోరుతున్నారు. 2019-2024 వరకు సర్పంచులుగా పనిచేసిన వారి పెండిం గ్ బిల్లులు రావాల్సి ఉన్నది.
ప్రభుత్వ సం క్షేమ, అభివృద్ధి కార్యక్రమాల బిల్లులను ప్రభుత్వానికి సమర్పించగా నేటికీ రేవంత్‌రెడ్డి సర్కారు క్లియర్ చేయలేదు. సర్పంచులకు ఆ మొత్తం రూ.700 కోట్ల వరకు రావాల్సి ఉన్న ది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్పంచుల సం ఘం జేఏసీ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సర్పంచుల పెండింగ్ బిల్లు ల వివరాలను తమకు అందించాలని పీఆర్ డైరెక్టర్‌ను కమిషన్ ఆదేశించింది. ఈ క్రమం లో ఉన్నతాధికారులు జిల్లా పంచాయతీరాజ్ అధికారులకు 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్ఎఫ్సీ నిధులు, జనరల్ ఫండ్స్, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, ఎంపీ, ఎమ్మెల్యే ఫండ్స్ వంటి వివరాలు రెండు రోజుల్లో పంపించాలని ఆదేశించారు.
బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు, శానిటేషన్ నిర్వహణకు కార్యదర్శులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఖాతా ల్లో నిల్వ ఉన్న నిధులు వాడుకొనేలా ఆర్థిక వెసులుబాటు కల్పించాలి. ఇప్పటివరకు ఉన్నఫ్రీజింగ్ను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలి. 19 నెలల్లో ఉన్న కార్యదర్శుల బిల్లులను స్థానిక ఎన్నికలు నిర్వహించే లోపు ప్రభుత్వం క్లియర్‌చేయాలి
-పీ మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
గ్రామాల అభివృద్ధికి సొంతంగా వెచ్చించిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని 19 నెలల నుంచి ముఖ్యమంత్రితోపాటు మంత్రుల చుట్టూ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసి విసిగిపోయాం. తక్షణమే ఎస్ఎఫ్సీ, ఎంబీ రికార్డయిన బిల్లులను విడుదల చేయాలి. స్టేట్ డెవలప్మెంట్ ఫండ్స్, మన ఊరు- మన బడి పనుల బిల్లులను కూడా క్లియర్ చేయాలి.
– సుర్వి యాదయ్యగౌడ్, తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు