హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. తమకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఉత్తరాలు రాసి పంపారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోస్టాఫీసు దగ్గర సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడురు లక్ష్మీనర్సింహారెడ్డి శుక్రవారం ఉత్తరాలను పోస్టుడబ్బాలో వేసి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా 16 నెలలుగా తమను వేధిస్తున్నదని మండిపడ్డారు. అనేక నిరసనలు, ఉద్యమాలు చేపట్టినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని పోస్టుకార్డు ఉద్యమానికి రాష్ట్ర కార్యవర్గం శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్, ప్యాక్స్ చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఇప్పటివరకు శాంతియుత కార్యక్రమాలు నిర్వహించామని, ఇక ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా రేవంత్ సర్కారు మొండివైఖరి ప్రదర్శిస్తున్నదని ధ్వజమెత్తారు. తక్షణమే బిల్లులు చెల్లించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.