ఆదిలాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లు బాలింతలకు, శిశువులకు ప్రయోజనకరంగా మారగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. దీంతో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు స్వయంగా కేసీఆర్ కిట్ల పంపిణీ శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా( కే )మాజీ సర్పంచ్ మీనాక్షి గాడ్గే, మాజీ ఎంపీటీసీ గాడ్గే సూభాష్ దంపతులు గ్రామంలో 24 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. తల్లి, శిశువుకు ఉపయోగపడే అన్ని రకాల వస్తువులను ఈ కిట్లో పొందుపరిచారు.
ఒక్కో కిట్టు విలు రూ.7 వేలు ఉంటుందని మాజీ సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా 24 మంది మహిళలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశామన్నారు. బాలింతల కోసం మానవీయ కోణంలో అలోచించి నాడు కేసీఆర్ ప్రభుత్వం డెలివరీ అయినా ప్రతి మహిళలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేసేదన్నారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు కేసీఆర్ కిట్లను ఇవ్వడం బంద్ చేసి రేవంత్ రెడ్డి మోసం చేసాడని విమర్శించారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసుతి అయిన ప్రతి మహిళకు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆదుకొన్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అదే మహిళలకు మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఇక నుంచి గ్రామంలో డెలివరీ అయిన ప్రతి మహిళకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తామని మీనాక్షి తెలిపారు.