ములుగు, ఏప్రిల్ 3 (నమస్తేతెలంగాణ) : మేడారం గద్దెల వద్ద గత నెల 25న జరిగిన ప్రమాదానికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. హనుమకొండలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న సమ్మక్క పూజారి కుమారుడు యువన్‌ను శుక్రవారం ఆయన పరామర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బాలుడికి తీరని నష్టం జరిగిందని తెలిపారు. మంత్రి సీతక్క వచ్చి పరామర్శించి రూ.10 వేలు చేతిలో పెట్టి వెళ్ల డం దారుణమని అన్నారు.
మంత్రులు ఇప్పటివరకు బాలుడిని ఆదుకునేందుకు ముందుకు రాకపోవడంపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. బాలుడికి అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించి, అతడి భవిష్యత్తు కోసం కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బాధితుడి తల్లిదండ్రులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. మేడారం ఘటనపై సిట్ వేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాం డ్ చేశారు. కాగా బీఆర్ఎస్ ములుగు జిల్లా అద్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, ఆయన సతీమణి ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత శుక్రవారం బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు.