హైదరాబాద్,జూన్ 5 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో బుధవారం గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బాదం, సీతాఫలం మొకలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పచ్చదనం, ఆరోగ్యకర వాతావరణం కోసం ప్రతిఒకరూ పుట్టినరోజుతోపాటు ఇతర ప్రత్యేక సందర్భాల్లో మొకలను నాటాలని పిలుపునిచ్చారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు భాగస్వాములయ్యారని తెలిపారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన వాతావరణాన్ని సృష్టించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉంటుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ, మాజీ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.